హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ప్రజా ప్రయోజనాలే ముఖ్యంగా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దినపత్రికలు, ‘టీ న్యూస్’ చానల్‌పై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో బుధవారం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ‘నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌పై అక్కసును మంత్రి వెళ్లగకారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకో ఏమో మరి! దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నాడు తెలంగాణ ఉద్యమ గొంతుకగా నిలిచిన ఏకైక పత్రిక నమస్తే తెలంగాణ.. ఏకైక చానల్ టీ న్యూస్.
ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసినయి.. ఉద్యమంలో అవి పోషించిన పాత్రను ఎవరూ మరిచిపోవద్దు.. అన్ని వర్గాలను ఏకం చేసి.. ఉద్యమానికి ఊపిరిలూదిన పత్రిక నమస్తే తెలంగాణ.. తెలంగాణ ప్రాంతానికి జరిగిన, జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తెచ్చింది నమస్తే తెలంగాణ..మరుగున పడిపోయిన మన చరిత్రను చాటి చెప్పింది.. తెలంగాణ కవులు, కళాకారులను వెలుగులోకి తెచ్చింది.. రైతులు, ఉద్యోగులు, కార్మికులు.. ఇట్ల అందరి వెతలను వివరించింది నమస్తే తెలంగాణ దిన పత్రికనే’ అని స్పష్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్’పై ఆరోపణలు చేస్తున్న మంత్రి.. ఈ 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పత్రికలు, చానళ్లకు ఎంత మొత్తంలో యాడ్స్ ఇచ్చారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. హరీశ్ ప్రశ్నకు పొంగులేటి బదులిస్తూ 16 నెలల్లో వివిధ పత్రికలు, చానళ్లకు రూ. 200కోట్ల యాడ్స్ ఇచ్చినట్టు తెలిపారు.