హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు నివసించే అశోక్‌నగర్‌లో కరెంట్ లేకుండా చేసి, అక్రమంగా నిర్భందించడమేనా ప్రజాపాలన? అని ఎక్స్ వేదికగా నిలదీశారు. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ లైబ్రరీకి వచ్చి ఓట్లు అడిగిన విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. పది నెలల పాలన పూర్తి కాకముందే విద్యార్థుల పట్ల కాంగ్రెస్ కపట ప్రేమ అసలు రంగు బయట పడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థుల పట్ల కరశంగా వ్యవహరిస్తున్న దుర్మార్గ విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు.