పిల్లలతో కారు ప్రయాణం.. సందడిగా సాగుతుంది. అదే సమయంలో కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది. ఎందుకంటే, వాహనాల్లోని భద్రతా ప్రమాణాలన్నీ పెద్దలకోసమే రూపొందినవి. అవి పిల్లలకు ఏమాత్రం రక్షణ కల్పించలేనివి. కాబట్టి, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు.. పెద్దలకన్నా పిల్లలపైనే ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే, పిల్లలు ఉన్నవారు ‘చైల్డ్ సీట్’ను తప్పకుండా కొనుగోలు చేయాలి. అప్పుడే, ప్రయాణం ఆహ్లాదకరంగా, సురక్షితంగా సాగుతుంది.
కారు సీట్లు, బెల్టులు.. అన్నీ పెద్దల కోసమే రూపొందాయి. పిల్లల శరీరాన్ని అవి ఏవిధంగానూ రక్షించలేవు. అందులోనూ, పిల్లలు సీటుబెల్టును ధరిస్తే.. అది వారి మెడ, కడుపు భాగంలోనే ఉంటుంది. దీనివల్ల ప్రమాద సమయంలో తీవ్రమైన గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, చిన్నపిల్లల కోసం వారి వయసు, బరువుకు తగిన కార్ సీట్ తప్పనిసరిగా వాడాలి. ప్రమాద సమయాల్లో వారిని సురక్షితంగా ఉంచడంలో ఈ సీట్లు ఎంతో సాయపడతాయి. చైల్డ్ సీట్లు ఒక ఏడాది కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులకు యాక్సిడెంట్స్‌లో మరణ ప్రమాదాన్ని 71 శాతం వరకూ తగ్గించగలవట. అదే నాలుగేళ్లలోపు వారైతే.. ప్రమాదాన్ని 54 శాతం వరకూ తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు. తల, మెడ, వెన్నెముకకు ప్రత్యేక రక్షణ ఇవ్వడం వల్ల.. ప్రమాదంలో తీవ్రమైన గాయాలయ్యే అవకాశాన్ని 70 శాతం వరకూ తగ్గిస్తుంది.
ఆకస్మికంగా బ్రేక్ వేసినప్పుడు, వాహనాలు ఢీకొన్నప్పుడు పిల్లలు కింద పడిపోకుండా చైల్డ్ సీట్లలోని ప్రత్యేక హార్నెస్ బెల్టులు ఉపయోగపడతాయి. ఇలాంటి సీట్లలో పిల్లల శరీరానికి తగిన కుషన్లు, సపోర్ట్ ఉంటాయి. అవి పిల్లలు నిద్రించడానికి సౌకర్యంగా ఉండటంతోపాటు నిద్రలో తల, మెడ నిటారుగా ఉండేలా చూస్తాయి. ఇక నాలుగేళ్లకన్నా ఎక్కువ వయసు ఉంటే.. బూస్టర్ సీట్లు దొరుకుతాయి. ఇవి పిల్లల ఎత్తును పెంచడంతోపాటు కారు సీట్ బెల్ట్‌ను సురక్షితంగా ఉపయోగించుకునేలా చేస్తాయి. ఈ బూస్టర్ సీట్లు నాలుగు నుంచి ఎనిమిదేళ్ల పిల్లలకు గాయాలయ్యే అవకాశాన్ని 45-70% తగ్గిస్తాయని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
చైల్డ్ సీట్ ఎంపిక చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. పిల్లల వయసు, బరువు, ఎత్తును పరిగణనలోకి తీసుకుని.. సీటును ఎంచుకోవాలి. పిల్లలకు రెండున్నరేళ్లు వచ్చే వరకు సీటును వెనుకకు చూసే స్థితిలోనే అమర్చాలి. దీనివల్ల ఇంకా అభివృద్ధి చెందుతున్న బిడ్డ వెన్నెముక, తల.. మరింత సురక్షితంగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా.. ఈ అదనపు సీట్లను కారు వెనుక సీట్లో మాత్రమే అమర్చాలి. ఎయిర్‌బ్యాగు ఉండే ముందు సీట్లలో చైల్డ్ సీటు పెట్టకూడదు. చిన్నపాటి ప్రమాదం జరిగినా.. ఎయిర్‌బ్యాగులు తెరుచుకొని, పిల్లల్ని ఎక్కువ గాయపరుస్తాయి. చివరిగా.. చైల్డ్ సీటు అనేది ‘లగ్జరీ’కి చిరునామా కాదు. అది పిల్లల ప్రాణాలను కాపాడే ప్రాథమిక భద్రతా పరికరం మాత్రమే!