వరంగల్, ఫిబ్రవరి 20 : భద్రకాళీ అమ్మవారి సాక్షిగా చెబుతున్న.. దళితులు, పేదల జోలికొస్తే ఊరుకునేదని లేదని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. చరబంబరాజు కాలనీ వాసులకు అండగా నిలబడుతామన్నారు. శుక్రవారం ఆయన వరంగల్ భద్రకాళీ ఆలయం సమీపంలోని చరబండరాజు కాలనీవాసులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా రాక్షస పాలన సాగుతున్నదని మండిపడ్డారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలను ధనికులు చేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ధనికులు, పేదలనే తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ ఒకేలా హక్కులు కల్పించిందన్న విషయం మరిపోవద్దన్నారు. గత 50 ఏళ్లుగా బండలు కొట్టుకుంటూ, చదును చేసుకొని కొందరు పేదలు ఇక్కడ జీవిస్తున్నారని, వారికి తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిపి వేసి ఇండ్లు ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గరిచేయడం తగదన్నారు. ఇది స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దుర్మార్గ చర్యకు నిదర్శనమని అన్నారు. చరబండరాజు కాలనీలో వెంటనే మౌలిక వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితలను కించపరిచేలా కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని విమర్శించారు.
దళితులు భద్రకాళీ దేవాలయం సమీపంలో నివసించడమే తప్పా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలు పేదలకు దక్కడం లేదు.. కానీ, ఎమ్మెల్యే అనుచరులు, బడాబాబులకు దక్కుతున్నాయన్నారు. పేదల ఇండ్లను కూల్చే అధికారం ఎవరిచ్చారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. వినయ్‌భాస్కర్ అంటేనే పేదల పక్షపాతి అని, అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల మధ్యే ఉంటానన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతానన్నారు.
అసత్య ఆరోపణలు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఎమ్మెల్యే నాయినికి సవాల్ విసిరారు. రాజీనామా చేసి రా.. 50వేలు కాదుకదా 5వేలు వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు, పిచ్చి మాటలు, వెకిలి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. పేదల ఇండ్లను కూల్చుడు కాదు.. వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. పేదలకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించామని, వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన హెచ్ఆర్సీ జస్టిస్ అక్తర్‌కు కృతజ్ఞలు తెలిపారు.
అధికారులు హెచ్ఆర్సీ ఆదేశాలు అమలు చేసి పేదలకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో చరబండరాజు కాలనీవాసులు సంబురాలు జరుపుకున్నారు. హెచ్ఆర్సీ జారీ చేసిన ఆదేశాల కాపీతో వచ్చిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్కు కాలనీవాసులు స్వీట్లు తినిపించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద సంబురాలు జరుపుకున్నారు.