Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టారీతిగా మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్లుందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉత్తమ్ ఉండటం దౌర్భాగ్యమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే రేవంత్, ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సింగిల్ పాయింట్ ఎజెండాగా మారిందని పేర్కొన్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లను, పంప్ హౌజ్‌లను వాడుకుంటూనే మరోవైపు అది వైట్ ఎలిఫెంట్ అనడం చెల్లదు ఉత్తమ్ గారూ.. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుంటే ఎట్లా? అని ప్రశ్నించారు.
రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పాలిట వైట్ ఎలిఫెంట్లు అని హరీశ్‌రావు ఆరోపించారు. ఒకరు రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు, మరొకరు నీటి వాటాకు గండి కొడుతున్నారని అన్నారు. ఏడాదిన్నర నుంచి కాళేశ్వరం మీద కుట్రలు చేయడం తప్ప, ఎక్కడా ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం కమీషన్ల కోసమే అని అదే పనిగా కారు కూతలు కూస్తున్నారని అన్నారు. తుమ్మిడిహట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని ఫిబ్రవరి 18, 2015, మార్చి4, 2015 చెప్పిన సీడబ్ల్యూసీ రాసిన లేఖల్లో పేర్కొన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
‘ ఏడేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అనుమతులు సాధించలేదు? తుమ్మిడిహట్టి వద్ద చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్న మాట వాస్తవం కాదా? తమ్మిడిహట్టి వద్ద మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి వ్యర్థమే అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తరం రాసిన మాట వాస్తవం కాదా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
‘ ఏడేళ్లు మహారాష్ట్ర, ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు సాధించలేదు. తట్టెడు మట్టి తీయలేదు, ఒక్క ఇటుక పేర్చలేదనేది దాచేస్తే దాగని సత్యం ఉత్తమ్ గారూ.. తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ.2328 కోట్లు స్వాహా చేసిన మీరా అవినీతి గురించి మాట్లాడేది. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే. పులులు శాకాహారం గురించి మాట్లాడటమే. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డీఎన్ఏలోనే అవినీతి ఉంది. ప్రజాధనం వృథా కావొద్దనే ఉద్దేశ్యంతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే విధానాన్ని రద్దు చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం 2007లో 17,875 కోట్లకు జీవో ఇచ్చి, 19నెలల్లోనే ఏ పని చేయకుండానే 38,500 కోట్లకు పెంచారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పుడు 40,300 కోట్లకు పెంచారు. ఏ పని చేయకుండానే అంచనాలు ఎలా పెరిగాయి. నాలుగేండ్లలో పూర్తి చేస్తామని చెప్పి, తట్టెడు మట్టి తీయకుండానే పదేండ్లలో సర్వే, మొబిలైజేషన్ పేరిట రూ. 2328 కోట్లు దండుకున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదా? ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఏడేండ్లలో 10వేల కోట్లు ఖర్చు చేసినమని చెప్పడం శుద్ద అబద్దం, భూసేకరణ, ఇతర అన్ని పనులకు మీరు చేసిన ఖర్చు కేవలం 3780 కోట్లు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నది నిజమే అయితే, తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే సోయి నిజంగానే ఉంటే, పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదు, అనుమతులు ఎందుకు సాధించలేదు? బ్యారేజీ ఎందుకు కట్టలేదు, గ్రావిటీ కెనాల్‌ను ఎందుకు ఎల్లంపల్లి వరకు తవ్వలేదు. మీరు ఆ రెండు పనులు చేస్తే, ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు చేసిన తప్పులు సరిదిద్దేందుకు, చేసిన ఖర్చు వృథా కాకుండా ఉండేందుకు ప్రాణహిత ప్రాజెక్టుకు రీ డిజైనింగ్ చేసి, కాళేశ్వరం నిర్మించినం. ఆనాడు కమీషన్లు దండుకొని, జేబులు నింపుకున్నది మీ ప్రభుత్వమే కదా.
జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది మీ నాయకులే కదా? జలయజ్ఞం ధన యజ్ఞం అని ఆనాడు కాగ్ రిపోర్టు ఇవ్వడం వాస్తవం కాదా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
‘ ఇప్పుడు కూడా… తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్పి 18 నెలలు గడుస్తున్నా, ఎందుకు తట్టెడు మట్టి తీయలేదో చెప్పాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో ఆరు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు ఇస్తమన్నరు, ఆరు ఎకరాలకు కూడా ఇచ్చింది లేదు. ముందు దీనికి జవాబు చెప్పండి. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో బీటలు వారిన భూములకు సాగు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించారు. తెలంగాణను సస్యశ్యామలం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మీరు విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారమే, 20లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీళ్లు అందాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మీ ఇంజినీర్లు అధికారికంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20 లక్షల 33వేల 572 ఎకరాల కొత్త ఆయకట్టు, స్థిరీకరణ జరిగింది. ‘ అని హరీశ్‌రావు తెలిపారు.
‘ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కూడా ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తప్పుగా కనిపిస్తున్నది. మీలాగా మేం బ్రోకర్లను పెట్టుకొని, 170 కోట్లు లంచాలు ఇచ్చి రుణాలు సేకరించలేదు. ఇష్టారీతిగా ప్రాజెక్టు వ్యయం పెంచారని అంటున్నారు.. మీరు ప్రాణహిత ప్రాజెక్టును ఎలాంటి పనులు చేయకుండానే 40వేల కోట్లకు పెంచారు. దాన్ని అలాగే కొనసాగించి ఉంటే అంచనా వ్యయం 80వేల కోట్లకు చేరేది. దేశంలో అంచనాలు పెంచకుండా పూర్తయిన ప్రాజెక్టు ఏదైనా ఉంటే చెప్పాలని సవాల్ విసురుతున్నా. అత్యంత తక్కువ కాస్ట్ ఎస్కలేషన్ తో పూర్తి చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం. మీరు దగ్గరుండి కట్టించిన పులిచింతల ప్రాజెక్టుతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ఇతర ప్రాజెక్టుల అంచనా వ్యయాలను ఒకసారి చూసి మాట్లాడాలని కోరుతున్నాం. ‘ అని హరీశ్‌రావు అన్నారు.
‘ ప్రాజెక్టు వ్యయం పెరిగిందని పదే పదే మాట్లాడుతున్న మీరు ఈ కింది విషయాలను పరిగణలోకి తీసుకుంటే మంచిదని హరీశ్‌రావు సూచించారు.
1, జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచినం.
2, నీటి వినియోగం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెంచినం.
3, ఆయకట్టు 16.40 లక్షల ఎకరాల నుంచి (18.25 లక్షల ఎకరాల ఆయకట్టు, 18.80 లక్షల ఎకరాల స్థిరీకరణ) 37 లక్షల ఎకరాలకు పెంచినం.
4, పంపింగ్ సామర్థ్యాన్ని 1.80 టీఎంసీ నుంచి 3 టీఎంసీలకు పెంచినం.
5, ఆన్లైన్ జలాశయాల సామర్థ్యాన్ని పెంచినందుకు భూసేకరణ, పునరావాసం కోసం ఖర్చు చేసినం. ఎకరానికి 2 లక్షలు ఇస్తే, ఎకరానికి 11 లక్షలు భూ పరిహారం ఇచ్చినం.
మంత్రి గారు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ‘ గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి గ్రావిటీ ప్రాజెక్టు అని చెప్పిన మంత్రి నిన్న మాట మార్చి ఒక్క పంపు ఉంటది అంటున్నడు. గతంలో ఓసారి ప్రిపేర్ అయి రాలేదని చెప్పి తన అజ్ఞానాన్ని చాటుకున్నడు, నేడు ఒక పంపు చాలంటూ మరోసారి అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నడు. ఒక్క పంపు, రెండు పంపులు ఉంటాయా మంత్రి గారు. ప్రతి చుక్కను అవసరమైనంత మేరకు ఎత్తిపోయాల్సిందే. గ్రావిటీ లేనే లేదు. రెండు దశాబ్దాలుగా పక్కన పెట్టడం వల్లనే ఎస్ఎల్బీసీ సొరంగం కూలిందని మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మా ప్రభుత్వ హయాంలో 3200 కోట్లు ఖర్చు చేసి 12 కిలోమీటర్లు సొరంగం సహా డిండి, పెండ్లిపాకల పనులు పూర్తి చేసినం. ఈ విషయాన్ని నిరూపించడానికి నేను సిద్దంగా ఉన్న. నువ్వు సిద్దంగా ఉన్నవా, కాదని నువ్వు నిరూపిస్తవా. ఎక్కడ చర్చ చేద్దాం.. హైదరాబాద్ లో చేద్దామా? హుజూర్ నగర్ లో చేద్దామా? ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, భూసార పరీక్షలు నిర్వహించకుండా, హడావుడిగా పనులు మొదలు పెట్టి, 8 మంది ప్రాణాలను బలిపెట్టింది మీరు కాదా? వంద రోజులు కావొస్తున్నా, సొరంగంలో చిక్కుకున్న వారి శవాలను కూడా బయటికి తీయని అసమర్థులు మీరు. ఎస్ఎల్బీసీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది మీ నిర్లక్ష్య పాలన. మీ అనాలోచిత చర్యల వల్ల ఎస్ ఎల్ బీ సీ కుప్పకూలింది. మీ అసమర్థతకు చెల్లించిన మూల్యం 8 మంది ప్రాణాలు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎప్పుడు, ఎక్కడ వాస్తవాలు చెప్పడానికైనా మేము సిద్ధం. విచారణ తర్వాత చర్యలు తప్పవని మంత్రి ముందే ఎలా ప్రకటిస్తున్నారు? మంత్రి మనసులో ఉన్న కుట్రకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?’ అని నిలదీశారు.