హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ‘నెలరోజుల్లో సనత్‌నగర్ టిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రకటించిన సీఎం రేవంత్ నిన్నటితో నెల దాటినా పట్టించుకోవడంలేదెందుకు? ఇప్పటికైనా ప్రారంభిస్తారా? ఎప్పటిలాగే దాటేసి మరో తేదీ ప్రకటిస్తారా? కోతల ముఖ్యమంత్రీ.. దీనికి మీ సమాధానం ఏమిటీ?’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో గప్పాలు కొట్టడం తప్ప, టిమ్స్ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మీరు చేస్తున్న కృషి శూన్యం అని ఆదివారం ఎక్స్ వేదికగా విమర్శించారు. టిమ్స్ దవాఖానల విషయం లో రెండేండ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. డేట్లు, డెడ్లైన్లు మార్చడం తప్ప ముఖ్యమంత్రి చేస్తున్నదేమీలేదని దుయ్యబట్టారు. ప్రభు త్వ భూములను తెగనమ్మడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు వైద్యసేవలు అందించే వైద్యశాలలపై లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. నత్తనడకన సా గుతున్న సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ దవాఖానల నిర్మాణ పనుల నిర్వహణలో సర్కారు తీరు చూస్తుంటే నత్త కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమోనని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు పై సీఎం రేవంత్, మంత్రుల మాటలు కోటలు దా టుతున్నాయని, కానీ కాలు మాత్రం గడపదాటంలేదని హరీశ్‌రావు విమర్శించారు. ఇందుకు నిర్మాణంలో ఉన్న టిమ్స్ వైద్యశాలలే నిదర్శమని ఎత్తిచూపారు. టిమ్స్‌లను పూర్తిచేయకుండా, పేదల కు అందించడంలో విఫలమైన రేవంత్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం చూపుతున్నదని దుయ్యబట్టా రు. ‘కరోనా తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ వందేండ్ల ముందుచూపుతో హైదరాబాద్ నలుదిక్కులా టిమ్స్ దవాఖానలకు రూపకల్పన చేశారని, ఏప్రిల్ 26, 2022న ఒకేరోజూ మూడు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపనచేసి రికార్డు సృష్టించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో శరవేగంగా సాగిన టిమ్స్ నిర్మా ణ పనులు, కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. దవాఖానలు అందుబాటులోకి వస్తే కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందనే కురుచబుద్ధి, కుచ్చిత మనస్తతత్వంతోనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసం ఆరాటపడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నదని దుయ్యబట్టారు.
అక్టోబర్ 3న బీఆర్ఎస్ తరుఫున కొత్తపేట టిమ్స్‌ను సందర్శించి దవాఖాన నిర్మాణంలో కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపామని హరీశ్‌రావు గుర్తుచేశారు. తెల్లారే సమావేశమైన మంత్రులు హడావుడిగా సమీక్షలు నిర్వహించి దవాఖానల ప్రారంభ తేదీలు ప్రకటించి బీఆర్ఎస్పై విమర్శ లు గుప్పించారని ప్రస్తావించారు. కానీ, తాము టిమ్స్‌ను సందర్శించి నెలన్నర దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిర్మాణ పనులు ఉన్నాయని విమర్శించారు. సత్వరమే పనులు పూర్తిచేసి సాధ్యమైనంత తొందరలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి చెప్పిన మాటలకే విలువలేకుండా పోయిందని చురకలంటించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై నోరుపారేసుకోవడం మానేసి, కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ దవాఖానల పనులను పూర్తిచేసి పేదలకు అత్యున్నత వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొనిరావాలని డిమాండ్ చేశారు.