హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తేతెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతమైనదని హరీశ్‌రావు కొనియాడారు. ఆదివారం అసెంబ్లీ చర్చలో ఆయన మాట్లాడుతూ ‘కాళేశ్వరం ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్.. ఎందుకంటే మంచిగా కాలమై.. మంచిగా వర్షాలు కురిస్తే ఎస్సారెస్పీ నుంచి మిడ్‌మానేరుకు నీళ్లు వస్తయి. అప్పుడు కేవలం మిడ్ మానేరు నుంచే కాళేశ్వరం పంపులను ఆపరేట్ చేస్తం. సాధారణ వర్షాలు కురిస్తే ఎల్లంపల్లి నుంచి పంపులను ఆపరేట్ చేస్తం. వర్షాలు కురవక కాలం కానప్పుడు.. ఎక్కడా నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లుండేది మేడిగడ్డ. అప్పుడు మేడిగడ్డ నుంచి పంప్‌లను వినియోగిస్తాం. కానీ ఉత్తమ్ మాట్లాడుతూ మేడిగడ్డ వాడకుండా కాళేశ్వరం నీళ్లు ఇచ్చినట్టు చెప్తున్నరు.
ఎట్లా ఇచ్చారు? ఆ నీళ్లు గాల్లో వచ్చినయా? ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీళ్లు వచ్చాయంటే అవి కాళేశ్వరం మోటర్ల ద్వారానే కదా? మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌లో గలగలా నీళ్లు పారుతున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కదా? అక్కడి నుంచి రంగనాయక సాగర్‌లో నీళ్లు పారుతున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కదా? రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్.. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌ను నీళ్లతో నింపుతున్నామంటే అది కాళేశ్వరం మోటర్లతోనే కదా? కాళేశ్వరం నీళ్లతోనే కదా?’ అని స్పష్టంచేశారు.
‘ఓ వైపు ప్రభుత్వం కాళేశ్వరం కూలింది.. లక్ష కోట్లు పోయాయని చెప్తున్నది. మరోవైపు హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని రూ.7 వేల కోట్లతో టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేసింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే రూ.7 వేల కోట్లతో మంచినీళ్లు, మూసీలో పో సే గోదావరి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నయి’ అని ప్రశ్నించారు. ఇవి కాళేశ్వరం నీళ్లు కావా? అని నిలదీశారు. ఈ మధ్య సీఎం రేవంత్‌రెడ్డి గంధమల్లకు వెళ్లి అక్కడ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారని, మరి ఆ గంధమల్లకు నీళ్లెక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుంచే గంధమల్లకు నీళ్లు పోతాయి కదా? అని నిలదీశారు. జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యులంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్దామని ఆహ్వానించారు. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్లో నీళ్లు వస్తున్నాయా? లేవా చూద్దామని, ఊరికే రాద్దాంతం చేయొద్దని హితవుపలికారు.
ఇక్కడ కాళేశ్వరం కూలలేదని, కేవలం పిల్ల ర్లు మాత్రమే కుంగాయని హరీశ్ గుర్తుచేశారు. ప్రభుత్వం మాత్రం కూలిందంటూ బద్నాం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ సర్కారు నిర్మించి న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 2005లో మొదలుపెడితే 2009లో కుడివైపు మట్టికట్ట కూలిపోయింది. జలయజ్ఞంలో చేపట్టిన పాలెం వాగు 2008, 2009లో కొట్టుకుపోయింది. ఇక కాంగ్రెస్ కట్టిన కడెం ప్రాజెక్టు 1958లో మొదటి సంవత్సరమే కొట్టుకుపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్ఎల్బీసీ కుప్పకూలింది.. సుంకిశాల కూలిపోయింది, పెద్దవాగు కొట్టుకుపోయింది. వట్టెం పంప్‌హౌ స్ మునిగిపోయింది. మహారాష్ట్రలో థిరాణి డ్యామ్, మధ్యప్రదేశ్‌లో కరమ్ డ్యామ్ ఇలా చెప్పుకొంటూ పోతే దేశంలో 80కి పైగా డ్యాంలు దెబ్బతిన్నాయి’ అని గుర్తుచేశారు.
‘ఎల్లంపల్లి, పాలెంవాగు, కడెంవాగు ఇవి కాంగ్రెస్ హయాంలోనే కట్టారు.. కాంగ్రెస్ హయాంలోనే కూలిపోయినయ్. కానీ మా విజ్ఞత ఏంటంటే కాంగ్రెస్ హయాంలో కూలిపోయిన పాలెం వాగును బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్‌లా కమిషన్లు వేయలేదు. ఆగమాగం చేయలే’ అని గుర్తుచేశారు. రాష్ట్రం, రైతులు, ప్రజల ప్రయోజనాల కోసం పాలెం వాగును పునరుద్ధరించి 2017లో ప్రజలకు నీళ్లిచ్చినట్టు తెలిపారు. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించినట్టు మంత్రి ఉత్తమ్ చెప్పారని, తెలంగాణ వచ్చిన తర్వాత ఎల్లంపల్లిపై రూ.2,052 కోట్లు ఖర్చు చేసి నీళ్లు నింపింది బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. మిడ్‌మానేరుపై రూ.1,586 కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు నింపింది బీఆర్ఎస్ అని స్పష్టంచేశారు. ‘ఇక్కడ ఈ డ్యామ్‌లలో ఇన్ని నీళ్లు ఎలా నింపుతారు? ప్రపంచంలో ఎక్కడా ఇన్ని నీళ్లు నింపరు’ అని మంత్రి ఉత్తమ్ చెప్పడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘ఫరక్కా బరాజ్ 30 టీఎంసీల సామర్థ్యం, యూపీలోని గంగా బరాజ్ 30 టీఎంసీల సామర్థ్యం, ఉత్తరాఖండ్‌లోని థెహ్రీ బరాజ్ 11 టీఎంసీలు, గుజరాత్‌లోని కర్కాపూర్ బరాజ్ 8.6 టీఎంసీలు, బెంగాల్‌లోని తుర్కాపూర్ బరాజ్ 20 టీఎంసీలు, అస్సాంలోని షంకోజ్ బరాజ్ 16 టీఎంసీలు.. ఇలా అనేక బరాజ్‌లలో భారీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నది’ అని గుర్తుచేశారు.
‘30 సార్లు మంత్రులు లేచి మాట్లాడితే వారికి సమాధానం చెప్పకపోతే నేను తప్పుల పడుతా. సమాధానం చెప్తే నా సబ్జెక్ట్ చెప్పుకోలేకపోతున్నా. వీళ్లు ఒక టాక్టిక్స్‌గా అనుకున్నట్టున్నరు. మాటి మాటికీ లేవాలె.. హరీశ్‌రావును మాట్లాడనివ్వొద్దు అని అనుకున్నట్టున్నరు. అందుకే లేస్తున్నరు అడ్డం తగులుతున్నరు’ అని హరీశ్ దుయ్యబట్టారు. కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు రాలేదంటూ మంత్రి ఉత్తమ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. ఇంజినీర్లు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులోనే కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కలిపి మొత్తం 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందించిందని గుర్తుచేశారు.
ప్రాణహితకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు పదే పదే పోలిక పెడుతున్నారని, ఈ రెండింటికి చాలా తేడా ఉన్నదని హరీశ్ వివరించారు. కాంగ్రెస్ సర్కారు చెప్పినట్టు నీళ్లు లేని చోట ప్రాజెక్టు నిర్మిస్తే అది పడావు పడుతుండెనని, స్కూల్ పిల్లలకు ఎక్స్‌కర్షన్‌కు మాత్రమే పని చేసేదని దెప్పిపొడిచారు. కానీ బీఆర్ఎస్ ప్రభు త్వం నీళ్లు వచ్చేలా చేసిందని స్పష్టంచేశారు.
దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా మొదటి సంవత్సరమే పూర్తి ఆయకట్టుకు నీళ్లు అందవని హరీశ్ స్పష్టంచేశారు. 1963లో ఎస్సారెస్పీకి నాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేయగా 1977లో ఇందిరాగాంధీ ప్రారంభించారని, మొత్తం 9 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉండగా ఇందిరాగాంధీ ప్రారంభించిన తర్వాత ఏడాది ఇచ్చింది 25 వేల ఎకరాలకేనని గుర్తుచేశారు. 15 ఏండ్ల తర్వాత పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారని చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 5-6 లక్షల ఎకరాలకు రావాల్సి ఉండగా కేవలం 90 వేల ఎకరాలకే వచ్చాయని తెలిపారు. పూర్తి ఆయకట్టుకు నీళ్లు రావడానికి పదేండ్లు పట్టిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సారెస్పీ స్టేజ్-2 కాలువల్లో తుమ్మలు మొలిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిచేసి సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ వరకు కాళేశ్వరం నీళ్లిచ్చింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు.
గత సీజన్లో వర్షాలు బాగా పడ్డాయి కాబ ట్టి ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ నుంచే మోటర్లను ప్రారంభించి నీళ్లను వాడుకున్నం కానీ మేడిగడ్డ నుంచి నీళ్లు తక్కువగా తీసుకొచ్చామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సభను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హరీశ్ చెప్పా రు. వర్షాలు మంచిగా పడితే అప్పుడు మేడిగడ్డను వినియోగించబోమని, మిడ్‌మానేరు నుంచి నీళ్లు తీసుకుంటామని వివరించారు. కాబట్టి మిడ్ మానేరు నుంచి ఎన్ని నీళ్లు తీసుకున్నామో లెక్కించాలని చెప్పారు. మేడిగడ్డ లెక్క చెప్పి తక్కువ నీళ్లు వాడారని తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.