Harish Rao | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ పథకాలను రద్దుచేసి కాంగ్రెస్ సర్కార్ తన అవివేకాన్ని బట్టబయలు చేసుకున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీ దగ్గరి నుంచి రైతుబంధు సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన అన్ని పథకాలపై రేవంత్ సర్కార్ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో 1,61,000 పోస్టులు భర్తీ చేసిందని, వాటిపై ఇంకా అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు . కేసీఆర్ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలకు నోటిఫై చేసి, పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసి, ఎన్నికల కోడ్ కారణంగా నియామక పత్రాలు ఇవ్వకుండా ఆగిపోతే అవన్నీ తామే భర్తీ చేసినట్టు చెప్పుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ దాకా, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ నుంచి మొదలుకొని స్థానిక నాయకత్వాల దాకా వైఫల్యాలనే విజయాలుగా చెప్పుకోవటంకన్నా దుర్మార్గం మరోటి ఉండదన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని గల్లీ నుంచి ఢిల్లీ దాకా డబ్బాలు కొట్టిన నేతలు ప్రభుత్వం ఏర్పాటై 300 రోజులు గడచినా చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు, అన్ని వర్గాలు తిరోగమన దిశలోకి వెళ్లాయన్నారు.
కాంగ్రెస్ సర్కార్ కొత్త హామీల అమలు సంగతి పక్కనపెడితే విజయవంతంగా అమలైన పథకాలను ఎత్తగొట్టిందని హరీశ్‌రావు విమర్శించారు. రైతుబంధు, దళితబంధు, బీసీబంధు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇలా అనేక విజయవంతమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయటం దుర్మార్గమని మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొకడమే ప్రజాపాలనా? అని హరీశ్‌రావు నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులకు కేసులు కొత్త కావని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని శనివారం ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు. ‘మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పేదల ఇండ్లు ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం హేయమైన చర్య. మా నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని హరీశ్ పేర్కొన్నారు.