కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చిన రేవంత్‌కు సంసారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. రేవంత్‌కు తెలిసిందల్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం మాత్రమే.
-హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ‘అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్‌రెడ్డి. నటనకు ఇచ్చినట్టు అబద్ధాలకు కూడా ఆసార్ ఇస్తే.. అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్‌రెడ్డినే ఎంపికచేస్తారు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. గురువారం నాటి ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెకుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యమని ఎద్దేవా చేశారు. ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియదని వెల్లడైందని పేర్కొన్నారు. పాపం దివంగతుడైన బచావత్ ఏ లోకంలో ఉన్నారో కానీ, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రదర్శిస్తున్న అజ్ఞానాన్ని చూసి ఎంత మదన పడుతున్నారోనని గురువారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చుతావా?
నోటితో మాట్లాడుతూ నొసటితో వెకిరించడం సీఎం రేవంత్‌రెడ్డి నైజమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సభకు వస్తే కేసీఆర్‌ను అవమానించబోమని ఒకవైపు చెప్తూనే.. మరోవైపు కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చుతావా? అని నిలదీశారు. తెలంగాణ పోరాటాన్ని ఉరకలెత్తించి, నాలుగు కోట్ల ప్రజలను ఒకటి చేసి.. ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేసి.. కాంగ్రెస్ మెడలు వంచి.. తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్‌తో పోల్చిన రేవంత్‌కు సంసారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదని మండిపడ్డారు. రేవంత్‌కు తెలిసిందల్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం మాత్రమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను, తనను ఉరితీయాలని, రాళ్లతో కొట్టాలని అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని సుద్దపూసలా నటిస్తావా.. రేవంత్? అని ఫైరయ్యారు.
నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు
సీఎం రేవంత్‌రెడ్డిని ఆవు తోలు కప్పుకొన్న తోడేలుగా హరీశ్‌రావు అభివర్ణించారు. ‘బీటింగ్ అరౌండ్ ద బుష్’ అన్నట్టు.. డొంక తిరుగుడు మాటలు మాట్లాడటం తప్ప, పోలవరం- నల్లమలసాగర్ విషయంలో తాను వేసిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ‘నువ్వు గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజం అయితే, ఢిల్లీ మీటింగ్‌కు ఎందుకు పోయినవ్? కమిటీ ఎందుకు వేసినవ్? ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచినవ్? కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడీకి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా అర్థం అవుతుంది.
కృష్ణాలో 763 టీఎంసీలు నువ్వు అడుగుతుంటే కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అబద్ధాలాడినవు. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నిజం అయితే, మొత్తం 811 టీఎంసీలు పున:పంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాశారు? ఈరోజు నువ్వు కొత్తగా 71% వాటా తెలంగాణకు రావాలని మాట్లాడినవు, ఆనాడే కేసీఆర్ 811 టీఎంసీల్లో 69% తెలంగాణకు దకాలని డిమాండ్ చేసిన విషయం నీకు తెలియదా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే
తెలంగాణను సాధించి, పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టేనని హరీశ్‌రావు విమర్శించారు. ‘తెలంగాణను సాధించి, ప్రజలకు ఎంత మేలు చేసారో తొమ్మిదేండ్ల పోరాటంతో సెక్షన్-3, కృష్ణా జలాల పున:పంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు చేసిన మహానీయుడు కేసీఆర్. ఆయనను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. అన్ని నదుల నీళ్లు జూరాలకే వస్తాయని, కొత్తగా శ్రీశైలంకు వచ్చేది ఏందని అతి తెలివితో అజ్ఞానంతో మాట్లాడినవు. తుంగభద్ర అనే నది ఉన్నదని నీకు తెలుసా? ఆ నది ద్వారా 450-600 టీఎంసీలు ప్రతి సంవత్సరం శ్రీశైలంకు వస్తాయనే కనీస జ్ఞానం నీకు లేకపాయె.
ఈ సంవత్సరం జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు మీ ప్రభుత్వమే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించింది? అదే శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి లోటు లేకుండా ఈ ఏడాది 2.8 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నది మీ ప్రభుత్వమే కదా? జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ రైతులకు ఈ విషయం తెలుసు. ఇంకా దానిమీద పాలమూరు-రంగారెడ్డి భారం కూడా పెడితే ఎవరికీ నీళ్లు రాక అందరూ ఆగం అయిపోరా? పాలమూరు-రంగారెడ్డి మీద ఎన్జీటీలో ప్రబుద్ధుడు ఒకడు కేసులు వేసిండు అన్నవు, ఆ ప్రబుద్ధుడిని పురమాయించింది నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? అయినా పాలమూరుకు 90 టీఎంసీలకు డీపీఆర్ పంపి ఏడు అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్, కేసీఆర్. మీరు వచ్చిన రెండేండ్ల ఒక నెలలో ఒక అనుమతి తెచ్చింది లేదు. డీపీఆర్ వెనకి వచ్చేలా చేశారు. ఇదీ నీ సమర్థత, నీ గొప్పతనం’ అని హరీశ్‌రావు చురకలంటించారు.
అన్ని నదుల నీళ్లు జూరాలకే వస్తాయని, కొత్తగా శ్రీశైలంకు వచ్చేది ఏందని అతి తెలివితో అజ్ఞానంతో మాట్లాడినవు. తుంగభద్ర అనే నది ఉన్నదని నీకు తెలుసా? ఆ నది ద్వారా 450-600 టీఎంసీలు ప్రతి సంవత్సరం శ్రీశైలంకు వస్తాయనే కనీస జ్ఞానం నీకు లేకపాయె.
-హరీశ్‌రావు
మీటింగ్ మినట్స్ చదువుకో..
‘కేంద్రం స్పందిస్తే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తారు? బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరపాలని ఎందుకు 28 లేఖలు రాస్తారు? రెండు అపెక్స్ మీటింగ్స్‌లో కేంద్రాన్ని ఎందుకు నిలదీస్తారు? అపెక్స్‌లో మీటింగ్ మినట్స్ పంపిస్తున్నా.. కండ్లు పెద్దవి చేసి చదువుకో.. రేవంత్‌రెడ్డీ’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. అపెక్స్ మీటింగ్ మినట్స్ కాపీని హరీశ్‌రావు మీడియాకు విడుదల చేశారు. ‘సెక్షన్-3 ద్వారా కృష్ణా జలాల పున:పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామీ మేరకు కేసు విత్‌డ్రా చేసుకున్న సంగతి నీకు తెల్వదా? ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్నావు?’ అని హరీశ్‌రావు విమర్శించారు.