భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ తర్వాత మరిచిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు పెట్టాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. హామీ ఇచ్చినట్టుగా వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు జరిగాయి. భద్రాచలంలోని కేకే ఫంక్షన్హాల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తలకిందులు తపస్సు చేసినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశానికి ప్రధాని కాలేరని ఎద్దేవా చేశారు.
అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని చెప్పి, ఇప్పుడేమో కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చాక అమలుచేస్తామని మాట మారుస్తున్నారని ఆరోపించారు. ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు ఇక కాంగ్రెస్‌ను నమ్మరని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ వెంటాడుతూనే ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, 6 లక్షల మంది ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డునపడ్డాయని వెల్లడించారు. ఒక్కో ఆటోడ్రైవర్‌కు నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో జిల్లాప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు.
ఉగాది పండుగ లెక్క బీఆర్ఎస్
ఉగాది పండుగ ఎంత శ్రేష్ఠమైనదో, బీఆర్ఎస్ పార్టీ కూడా అంత గొప్పగా ఉంటుందని హరీశ్‌రావు అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ప్రజల పక్షమేనని చెప్పారు. ఉద్యమాలు పార్టీకి కొత్తకాదని, తెలంగాణ తెచ్చుకున్నది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. నాటి ముఖ్యమంత్రులైన చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి మెడలు వంచి రాష్ర్టాన్ని సాధించుకున్నామని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు.
ఢిల్లీలో కొట్లాడేది బీఆర్ఎస్సే
తెలంగాణ ప్రయోజనాలకు ఢిల్లీలో కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీయేనని హరీశ్‌రావు అన్నారు. బీజేపీతో జతకట్టిన కాంగ్రెస్.. సాగునీటి ప్రాజెక్టులను కేంద్రానికి తాకట్టు పెట్టిందని విమర్శించారు. దీన్ని కూడా కేంద్ర జల్‌శక్తి మంత్రి ముందు నిలదీసింది బీఆర్ఎస్ ఎంపీలేనని తేల్చి చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని రాష్ట్రంలో ఓడించింది బీఆర్ఎస్ పార్టీనేనని అన్నారు. బండి సంజయ్, అర్వింద్, ఈటల రాజేందర్ వంటి నాయకులను ఎన్నికల్లో ఓడించింది కారు గుర్తేనని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడటం ఖాయమని వెల్లడించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు ఊర్లలోకి పోయే పరిస్థితి లేదని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భద్రాచలాన్ని ఆదర్శంగా తీసుకుని మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.