Harish Rao : గురుకులాకు గ్రీన్ ఛానెల్లో నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలేనా..? అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. కమీషన్లు రావనే ఆయన గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా..? అని విమర్శించారు. హామీలతో మభ్యపెట్టడం, ఆ తర్వాత మాట మార్చడమే రేవంత్ అనుసరిస్తున్న సిద్ధాంతమా..? అని నిలదీశారు. ఈ మేరకు హరీశ్‌రావు ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండదనడానికి గురుకులాలకు కేటాయించిన చాలీచాలని నిధులే ఉదాహరణ. రాష్ట్రంలోని 1024 గురుకులాలకు కేవలం రూ.60 కోట్లు కేటాయించి, గోరంతను కొండంతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. రూ.12 వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు చదివే గురుకులాలకు కనీసం రూ.100 కోట్లు కేటాయించే మనసు లేదా..?’ అని ప్రశ్నించారు.
‘కమీషన్లు రావనే గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా? మీరు కేటాయించిన చాలీచాలని నిధులతో సిబ్బంది వేతనాలు, మోటార్ల మరమ్మతులు, అత్యవసర పనులు ఎలా సాధ్యం? చిత్తశుద్ధిలేని సమీక్షలతో గురుకులాలకు ఏం ప్రయోజనం? ఒకవైపు సమస్యల వలయంలో గురుకులాలు కొట్టుమిట్టాడుతుంటే తూతూమంత్రంగా సమీక్ష నిర్వహించడం దుర్మార్గం. గురుకులాలకు నిత్యావసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు? పెండింగ్ లో ఉన్న మెస్ చార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు, స్టిచ్చింగ్ ఛార్జీలు ఎప్పుడిస్తారు? అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు అద్దె బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? నెలలుగా పెండింగ్‌లో ఉన్న తాత్కాలిక సిబ్బంది వేతనాలు ఎప్పుడిస్తారు?’ అని హరీశ్‌రావు నిలదీశారు.
‘మీరు కేటాయించిన చాలీచాలని నిధులతో సమస్యలకు పరిష్కారం ఎలా చూపుతారు? గణితం ఉపాధ్యాయులను నియమించాలని నిన్న మెదక్ జిల్లా చేగుంట గురుకులం విద్యార్థులు రోడ్డెక్కారు? పురుగులన్నం మాకొద్దు అంటూ నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు? గురుకులాల మీద ప్రభుత్వానికి పట్టింపు ఉంటే విద్యార్థులు ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నారు? బడిబాట పట్టాల్సిన విద్యార్థులను, ఆందోళన బాట పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డీ మీ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతిని దిగజార్చారు. విష వలయాలుగా మార్చారు. అపఖ్యాతిని మూటగట్టుకున్నారు’ అని మండిపడ్డారు.
‘గ్రీన్ చానెల్లో గురుకులాలు, వసతి గృహాల బిల్లులు చెల్లిస్తామన్న మాటలు ఇంకెప్పుడు కార్యరూపం దాల్చుతాయి? ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఏదో చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడంవల్ల గురుకులాల్లో సమస్యలు తీరవు. గురుకులాల కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు, గురుకులాల అద్దె బకాయిలు, నెలలుగా పెండింగ్‌లో ఉన్న తాత్కాలిక సిబ్బంది వేతనాలు, మెస్, కాస్మొటిక్, స్టిచ్చింగ్ ఛార్జీలు వెంటనే చెల్లించాలి. 22 నెలలుగా గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై అవసరమైన నిధులు విడుదల చేయాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.