హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అశాంతి, అలజడి నెలకొన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు దుర్మార్గపు దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక ప్రతిపక్షాలపై దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో దాడులు చేస్తే, కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి అడ్డగోలు పరిస్థితులు ఉండేవా?’ అని ప్రశ్నించారు. దాడులు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని, తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.