Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వాస్తుభయం పట్టుకున్నది. గేట్లు మార్చినా, తన చాంబర్లో మార్పులు చేసినా సెక్రటేరియట్ మెట్లు ఎకడం లేదు. ఆ భయం పోక కేవలం కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీఎస్)కే పరిమితం అయ్యారు. మంత్రులతో కలిసి ప్రెస్మీట్లు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే పెడుతున్నారు.
– హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సాగేది ప్రజాపాలన కాదని, బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడిచే బ్రోకర్ల పాలన అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. ప్రపంచ చరిత్రలో అప్పులు తేవడానికి ప్రత్యేకంగా కన్సల్టెన్సీని పెట్టుకున్న ప్రభుత్వం.. రేవంత్‌రెడ్డిదేనని మండిపడ్డారు. రూ.10వేల కోట్ల అప్పులు ఇప్పించినందుకు బ్రోకర్ కంపెనీకి గతంలోనే రూ.180 కోట్ల కమీషన్ ఇచ్చినట్టు స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ అదే బ్రోకర్ సలహాతో జీహెచ్ఎంసీని మూడు ముకలు చేసి రూ.30వేల కోట్ల అప్పుతేవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్ అంటూ లీకులు ఇస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ ముగియగానే ఫోన్‌ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇస్తారట.. అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రేవంత్ మెప్పు కోసం, పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. అధికారుల ఓవర్‌యాక్షన్ రికార్డు అవుతున్నదని, రిటైర్ అయినా, విదేశాలకు, సెంట్రల్ సర్వీసుకు వెళ్లినా, ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టబోమని, వడ్డీ సహా చెల్లిస్తామని, గుంజుకొచ్చి ఊచలు లెక్కబెట్టిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు.
కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో డిఫెన్స్‌లో పడ్డ సర్కారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా డిఫెన్స్ పడిపోయిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. తన 25 ఏండ్ల రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9:30 గంటలకు మీడియాతో చిట్-చాట్ పెట్టి వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. జలదోపిడీపై కేసీఆర్ సూటిగా అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా సీఎం దాటవేశారని విమర్శించారు. అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్మీట్లు పెట్టారంటే అది కేసీఆర్ పవర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే రేవంత్‌రెడ్డి సర్కారు భయపడుతున్నదని అన్నారు. గురుకులాల పిల్లలు నాణ్యమైన భోజనం అందక ఫుడ్‌పాయిజన్‌తో దవాఖానల పాలవుతుంటే.. అందాల పోటీలు, ఫుట్‌బాల్ పోటీలు, గ్లోబల్ సమ్మిట్లు వారికి అన్నం పెడతాయా? అని నిలదీశారు.
ఓటమి భయంతోనే ‘సహకారం’ లేదు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4వేల మందికిపైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలువడంతో రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని హరీశ్‌రావు విమర్శించారు. అందుకే కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా, కాంగ్రెస్ కార్యకర్తలను నామినేషన్ల ద్వారా నియమించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘ఇదేం పద్ధతి కాంగ్రెస్ నేతలను ఎన్నుకోవడం ఏమిటి? బీఆర్ఎస్ దెబ్బకు డీసీసీబీలకు ఎన్నికలు పెట్టడం లేదు. రేవంత్ సర్కారుకు దమ్ముం టే కోఆపరేటివ్ ఎన్నికలు జరపాలి. ధాన్యానికి బోనస్, కౌలు రైతులకు 12వేలు, రైతు భరోసా హామీలు నెరవేర్చకపోవడంతో రైతుల తిరగబడతారనే ఎన్నికలకు వెళ్లడం లేదు. గతంలో రెండుసార్లు బీఆర్ఎస్ సర్కారు సహకార ఎన్నికలు నిర్వహించింది’ అని గుర్తుచేశారు.
ఓయూకు ఒంటరిగా వస్తానని ప్రగల్భాలు
ఓయూకు ఒంటరిగా వస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లారని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్టు చేయించి వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనమని మండిపడ్డారు. చెకింగ్లు, చెక్‌పోస్టుల మధ్య, విద్యార్థుల నేతల నిర్బంధాల మధ్య ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలుచేస్తే విద్యార్థులకు భయపడే పరిస్థితి ఎందుకు ఉంటుందని నిలదీశారు.
పీపీటీకి మాకూ చాన్స్ ఇవ్వాలి
ఇరిగేషన్‌పై ప్రభుత్వం పీపీటీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. పీపీటీపై అసెంబ్లీలో తమకు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘పాలమూరు’ ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు ఖర్చుచేశామని చెప్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఆ నిధులతో 7 గజాల కాలువ అయినా తవ్వరా? అని ప్రశ్నించారు. రూ.7వేల కోట్లను ఉత్తమ్, భట్టి పంచుకున్నారని విమర్శించారు. ఎవరు 20శాతం కమీషన్ ఇస్తే వారికి కాంట్రాక్టు పనులు కట్టబెట్టారని ఆరోపించారు. వారికే బిల్లులు ఇస్తున్నారని మండిపడ్డారు.
ఇష్యూను డైవర్ట్ చేయటంలో రేవంత్ టాప్
ఇష్యూను డైవర్ట్ చేయడంలో సీఎం రేవంత్ మొనగాడని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ఒకదానికి కూడా సమాధానం ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇరుకున పడిన ప్రతిసారీ.. నోటీసులు అంటూ ఒక లీక్ ఇస్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ-రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ‘ఎన్ని లీకులు ఇచ్చినా.. ఎన్ని కేసులు పెట్టినా.. రేవంత్‌ను వదిలే ప్రసక్తే లేదు. అసెంబ్లీ అయిపోయిన సాయంత్రమే రేవంత్ నాకు నోటీసు ఇవ్వమన్నారట. రాష్ట్రం తెచ్చినోళ్లం. త్యాగాల చరిత్ర మాది. రేవంత్‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం. ఇంకా గట్టిగా పనిచేస్తాం’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ సరార్ వేస్తున్న సిట్ పెద్ద జోక్ అయిందని, గతంలో ఆరుగురితో సిట్ వేస్తే, మళ్లీ ఇప్పుడు 9 మందితో వేశారని విమర్శించారు.
ఖాకీ బుకు కొందరికేనా?
రెడ్ బుక్ లేదు.. పింక్ బుక్ లేదు ఉన్నది ఒక్క ఖాకీ బుక్ అన్న డీజీపీ శివధర్‌రెడ్డి.. రూల్‌బుక్, ఖాకీ బుకు కొందరికేనా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. డీజీపీ శివధర్‌రెడ్డికి ఫుట్‌బాల్ మ్యాచ్ రక్షణకే సమయం సరిపోతున్నదని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా సర్జాపూర్‌లో ఓటేయలేదనే కక్షతో సర్పంచ్‌గా ప్రమాణం చేసిన వెంటనే బుల్డోజర్తో దళితుల ఇల్లు కూలగొడితే.. పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఓటేయలేదని దళితుడి ఇల్లు కూలుస్తారా? మీ ఖాకీ బుక్ చేస్తున్నది? ఇదేనా అని నిలదీశారు. పోలీసుల పనితీరు ఇలాగేనా? డీజీపీ సమాధానం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖాకీ పుస్తకం ఎవరి కోసమో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఖాకీ పుస్తకం, చట్టం అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.
కానిస్టేబుళ్లు, హోంగార్డులే తిరగబడే పరిస్థితి
పోలీస్‌శాఖ తీరుపై కానిస్టేబుళ్లు, హోంగార్డులే తిరగబడే పరిస్థితి తలెత్తిందని హరీశ్‌రావు హెచ్చరించారు. ఆరోగ్య భద్రతా పథకాన్ని లక్షకు కుదించారని కానిస్టేబుళ్లు తన దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. వారి టీఏ, డీఏ అలవెన్సులపై డీజీపీ దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో స్టేషన్ అలవెన్సులు వచ్చేవని, ఇప్పుడు రావడం లేదని చెప్పారు. కానిస్టేబుళ్లకు నాలుగు సరెండర్ లీవ్స్ ఉన్నాయని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా యూసఫ్‌గూడ బెటాలియన్‌లోని 2వేల మంది కానిస్టేబుళ్లకు సరెండర్ లీవ్స్, అలవెన్స్‌లు ఇచ్చారని, మిగతా 98వేల మంది ఎందుకు ఇవ్వలేదని అని ఆయన ప్రశ్నించారు.
45 టీఎంసీలకు ఉత్తమ్ లేఖ నిజం
తెలంగాణకు 45 టీఎంసీలు చాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తరం రాయడం చారిత్రక తప్పిదమని, కేంద్రానికి ఆయన ఈ ఉత్తరం రాసిన మాట వాస్తవమని హరీశ్‌రావు చెప్పారు. ఇందుకు సంబంధించిన లేఖను మీడియా ప్రతినిధులకు ఇచ్చారు. తప్పు ఒప్పుకొని చెంపలు వేసుకుని.. 90 టీఎంసీలకు మళ్లీ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదీ జలాల్లో కాంగ్రెస్ సరార్ వాడిన నీటి వాడకం 28.49శాతం మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంత తక్కువగా నీటి వినియోగం గత పదేండ్లలో ఎన్నడూ జరుగలేదని స్పష్టంచేశారు. కృష్ణాజలాల నీటి వాడకం పదేండ్లలో ఎలా ఉన్నదో వివరించే టేబుల్‌ను ఆయన మీడియా ప్రతినిధులకు అందజేశారు. నదీ జలాలు, సాగునీటి పారుదల, ధాన్యం ఉత్పత్తి, ఏపీ జలదోపిడీకి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల సహకారం, ఇతర అంశాలపై తాను మంత్రి ఉత్తమ్‌తో ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమని హరీశ్‌రావు సవాల్ చేశారు. ఏ చానల్ వేదికగా అయినా, ప్రెస్‌క్లబ్‌లో అయినా తాను చర్చకు సిద్ధమని, ఉత్తమ్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.
అక్రమ కేసులకు భయపడం
దేవుడి మీద ఒట్టేసి కూడా సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు రుణమాఫీ చేయలేదని, ప్రజలకు అరిష్టం జరుగకుండా ఆయన్ను క్షమించాలని యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని యాదగిరిగుట్టలో వేడుకుంటే తనపై కేసు పెట్టారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తే తన కారుపై కాంగ్రెస్ మూకలు దాడి చేశాయని చెప్పారు. తాను ఫిర్యాదుచేసినా ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని ఆయన స్పష్టంచేశారు.
అసెంబ్లీలో మా గొంతు నొకొద్దు.
ఎవరి వాదన నిజమో ప్రజలే తేల్చుతారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే బీఆర్ఎస్కు తకువ సమయం ఇస్తున్నారు. బీఆర్ఎస్ అంటే ప్రభుత్వానికి భయం.. అందుకే ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చకు మైక్ ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షానికి సంఖ్య ఆధారంగా మైక్ ఇవ్వాలి. కాంగ్రెస్ ద్రోహం, ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో వెల్లడిస్తాం. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి.
– హరీశ్‌రావు
రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం
కాదు. కన్సల్టెన్సీ కంపెనీ. బొంబాయి బ్రోకర్ల సలహాలతో ప్రభుత్వం నడుస్తున్నది. టీజీఐఐసీ ద్వారా అప్పులు ఇప్పించినందుకు ఒక బ్రోకర్ కంపెనీకి గతంలోనే రూ.180 కోట్ల కమీషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే బ్రోకర్ సలహాతో జీహెచ్ఎంసీని మూడు ముకలు చేసి రూ.30వేల కోట్ల అప్పు తేవాలని చూస్తున్నారు.
– హరీశ్‌రావు
ఒకరిద్దరు పోలీస్ అధికారులు
పోస్టింగ్‌ల కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రేవంత్ మెప్పు కోసం.. అక్రమ కేసులు పెడుతున్నారు. రేవంత్ చేతిలో పావులుగా మారితే తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ పోలీస్ అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది. కేసులు నాకు కొత్త కాదు. ఉద్యమంలో నాపై 300 కేసులు పెట్టారు. రేవంత్ సైతం నాపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఎక్స్‌ట్రాలు చేస్తున్న పోలీసుల పేర్లు రాసుకుంటున్నాం. వదిలిపెట్టం. వడ్డీ సహా చెల్లిస్తాం. ఎక్కడికి వెళ్లినా గుంజుకొస్తాం. ఊచలు లెక్కపెట్టిస్తాం.
– హరీశ్‌రావు
పదేండ్లలో కృష్ణా జలాల వినియోగం (2014-15- 2024-25 వరకు) (టీఎంసీల్లో)
