సిద్దిపేట, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :‘రేవంత్‌రెడ్డికి ముందు చూపు లేక.. కాంగ్రెస్ చేతగానితనం వల్ల రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మీకు చేతగాకపోతే రాజీనామా చేసి గద్దె దిగండి. ఐదు ఎకరాలున్న రైతుకు 10 బస్తాల యూరియా అవసరమైతే ఒకటిస్తా.. రెండిస్తా అని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి మాటలు ఎకువ చేతలు తకువ అని ఎద్దేవాచేశారు. ఎరువుల కోసం కేంద్రంపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలని, రాజీనామా చేస్తామని బెదిరించైనా రాష్ర్టానికి ఎరువులు తేవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల యూరియా కేంద్రం వద్ద రైతులతో హరీశ్ మాట్లాడారు. యూరియా కోసం వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘రైతుల కంటే మీకు పదవులు ముఖ్యమా? బస్తాలను పంచడానికి ఎప్పుడైనా కేసీఆర్ హయాంలో పోలీసులు కనపడ్డారా? ఇప్పుడు పోలీసులు లేకుండా పంచే పరిస్థితి లేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతులకు ఇబ్బంది కాకుండా ఊరూరికి ఎరువులను పంపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఏమిటంటే ఎరువు బస్తాల కోసం రైతులను క్యూలో నిల్చోబెట్టి మళ్లీ పాత రోజులను గుర్తుచేస్తున్నదని దుయ్యబట్టారు. కేసీఆర్ ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ కిరాయి, హమాలీ ఖర్చులు లేకుండా ఊరూరికీ ఎరువులు పంపామని గుర్తుచేశారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట సాగు తగ్గిందని, అయినా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ‘కేసీఆర్‌ను తిట్టుడు కాదు.. పరిపాలన మీద దృష్టి పెట్టు అని మీ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డే చెప్పిండు’ అని దుయ్యబట్టారు. ఎరువులివ్వ చేతకాక కాంగ్రెస్, బీజేపీ ఒకదానినొకటి తిట్టుకుంటూ డ్రామాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీఏ ట్యాక్స్ రూ. రెండు వేల కోట్ల భారాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసలే ఆర్థిక మాంధ్యం, వరుసగా రెండో నెల ఆర్థిక డిఫ్లేషన్‌లో తెలంగాణ ఉన్నదని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ప్రజలపై రేవంత్‌రెడ్డి సర్కారు ట్యాక్స్‌లు పెంచుతూ మరింత భారం మోపుతున్నదని ఫైర్ అయ్యారు.