Harish Rao | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా ఇచ్చేదాకా రేవంత్ సర్కారును వెంటాడుతామని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. మార్చి 31 కల్లా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పెట్టిన గడువు ఏమైందని ప్రశ్నించారు. చేసిన వాగ్దానాలను తుంగలో తొకడం, మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని మంగళవారం ఎక్స్ వేదికగా ఎద్దేవాచేశారు. మార్చి 31 కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని గత జనవరి 26న గొప్పగా ప్రకటించారని, మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి మాటలు ఘనంగా.. చేతలు హీనంగా ఉన్నాయని దెప్పిపొడిచారు. మాటలు కోటలు దాటితే..అడుగు గడప దాటడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలను నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురు చూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైందని వాపోయారు.
రైతులను ఎన్నిసార్లు మోసగిస్తవ్ రేవంత్?
‘దసరాకు ఇస్తమన్నరు.. ఇవ్వలేదు. సంక్రాంతికి ఇస్తమన్నరు.. ఇవ్వలేదు. ఉగాదికి ఇస్తమని ఊరించి చివరికి రైతులను ఉసూరు మనిపించిండ్రు.. కొత్త సంవత్సరం రైతులకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకి’ ఆని హరీశ్ తూర్పారపట్టారు. ‘రైతులను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తవ్ రేవంత్‌రెడ్డీ’ అని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాట్ల సమయంలో రైతు బంధు ఇస్తే, రేవంత్ రెడ్డి కోతల నాటికి కూడా రైతు భరోసా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. మోసమే తన విధానంగా మార్చుకున్న రేవంత్‌రెడ్డి.. రైతులను అన్ని విధాలుగా దగా చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడుతలేదు.. డేట్లు మాత్రం మారుతున్నయి.. డెడ్లైన్లు మారుతున్నయి తప్ప రైతులకు ఇచ్చిన హామీలను మాత్రం సర్కారు నెరవేర్చడం లేదు’ అని విమర్శించారు. రుణమాఫీ చేసేదాకా.. రైతు భరోసా ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వెంటాడుతూనే ఉంటుందని, ఎకడికకడ నిలదీస్తూ, వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటుందని హెచ్చరించారు.