Harish Rao | సంగారెడ్డి అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): పేదల కడుపు నింపడం కేసీఆర్ ఎజెండా అయితే.. పేదల కడుపుకొట్టడమే కాంగ్రెస్ ఎజెండాగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల బతుకులను ఆగం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా అందోల్‌లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన జరిగిన ఆలయ్బలయ్ కార్యక్రమానికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథులుగా హాజరై ముందుగా జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా బతుకమ్మ, దసరా పండుగలను కూడా జరుపుకోలేని పరిస్థితిని కాంగ్రెస్ సర్కార్ తెచ్చిందని దుయ్యబట్టారు. పండుగపూట పేదలు కొత్త చీరలు లేకుండా ఉండవద్దని కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని గుర్తుచేశారు.రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బతుకమ్మ చీరలనే పంపిణీ చేయలేదని, రెండు బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వకుండా పేద మహిళలకు పండుగ పూట కొత్త చీరలు లేకుండా చేశారని మండిపడ్డారు.
మంచినీళ్లు కూడా ఇవ్వలేరా?
ప్రజలకు మంచినీటిని సైతం సరఫరా చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని హరీశ్ ధ్వజమెత్తారు. నారాయణఖేడ్‌లోని సంజీవన్‌రావుపేటలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందటంతోపాటు పెద్దసంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించిందని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ పరిశుభ్రమైన తాగునీరు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ఉంటే దసరా పండుగలోపు రైతులకు రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడేవని గుర్తుచేశారు. రూ.15వేల రైతుబంధు డబ్బులు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పటికీ ఇవ్వలేదని, దసరాకు రైతుబంధు ఇస్తామని.. త్వరలోనే క్యాబినేట్లో నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంట రుణమాఫీపైనా కాంగ్రెస్‌కు స్పష్టతలేదని, గతేడాది డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి మాఫీ చేయలేదని, తర్వాత బడ్జెట్లో పెడతామని చెప్పి పెట్టలేదని, ఆగస్టు 15 వరకు చేస్తామని సగం మందికి కూడా మాఫీ చేయలేదని దుయ్యబట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వచ్చే డిసెంబర్ 9లోగా వందశాతం రుణమాఫీ చేస్తానని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు.
పదేండ్లు సుభిక్షం.. ఇప్పుడు దుర్భిక్షం : సిరికొండ
కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి దుయ్యబట్టారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు చాలా గొప్పవని, తెలంగాణ గొప్పదన్ని చాటేలా మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఏటా ఆలయ్ బలయ్ నిర్వహించటం ఆనందంగా ఉన్నదని తెలిపారు.
పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దు : కా్రంతి కిరణ్
ఆలయ్బలయ్ నిర్వహించటం సంతోషంగా ఉన్నదని, ఇదే సమయంలో పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు మృతి చెందటం బాధించిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. అందోలు నియోజవకర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటానని, పార్టీ శ్రేణులు ఎవరూ అధైర్యపడవద్దని, అండగా కేసీఆర్, హరీశ్‌రావు ఉన్నారని తెలిపారు.
మరో పోరాటానికి ఆయుధ పూజ : రసమయి
మాజీ మంత్రి హరీశ్‌రావు చేసింది జమ్మిచెట్టు పూజ కాదని, మరో తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయుధ పూజ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అభివర్ణించారు.. ఈ ఆయుధాలను అందుకొని మళ్లీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ పాలన చూస్తుంటే మళ్లీ పాతరోజులు గుర్తుకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలు విజయరామరాజు, అల్లం నవాజ్‌రెడ్డి మృతిచెందగా వారి చిత్రపటాల వద్ద హరీశ్, క్రాంతికిరణ్ నివాళులర్పించారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో బిచ్కుంద పీఠం స్వామీజీ సోమయప్ప స్వామి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మఠం భిక్షపతి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంటి రాహుల్, మాణిక్యం, జైపాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, సోమిరెడ్డి, బాల్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, మనోహర్‌గౌడ్ పాల్గొన్నారు.