హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పదేండ్ల పాలనలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ పరుగులు పెట్టి దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఐటీ, ఇండస్ట్రియల్ పాలసీలు, గ్రామీణ, పట్టణాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు, ఉద్యోగాల కల్పనలాంటి బృహత్తర పథకాలతోనే ఆర్థిక స్థిరత్వం సాధ్యమైందని పేర్కొన్నారు. తలసరి ఆదాయంపై తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో సమాధానమిస్తూ 2013-14 నుంచి 2023-24 వరకు తెలంగాణ రాష్ట్రం ఎన్ఎస్డీపీలో 84.3 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించిన విషయాన్ని హరీశ్ మంగళవారం ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.
కేంద్రం వెల్లడించిన గణంకాలు కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థిక ప్రగతి ప్రస్థానానికి సజీవ సాక్ష్యాలని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు, వినియోగశక్తి పెరుగుదలకు స్పష్టమైన సూచికలని తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్ విజనరీ పాలనకు ఇవి నిదర్శమని పేర్కొన్నారు. ఏదేమైనా తెలంగాణ ఆర్థిక ప్రగతి మనందరికీ గర్వకారణమని అభివర్ణించారు. రేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం పేరిట నూకలు, పాలిష్ రైస్‌ను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తున్నదని హరీశ్ ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని వెల్లడించారు. మూడు నెలల రేషన్ కోటా సన్నబియ్యంలో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని విమర్శించారు.
రేషన్‌కార్డులపై గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం
బీఆర్ఎస్ హయాంలో 6, 47, 479 రేషన్ కార్డులను పంపిణీ చేశామని హరీశ్ గుర్తుచేశారు. గతంలో ప్రజాపంపిణీ లబ్ధిదారులు ఒక్కొక్కరికీ నాలుగు కేజీల బియ్యం పంపిణీ చేయగా, ఆరు కిలోలకు పెంచిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీపై గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొత్త కార్డుదారులకు ఈ నెల నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
పథకాల్లో కోతలు.. జీతాలివ్వక ఉద్యోగులకు వాతలు
‘అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కోతలు..సకాలంలో జీతాలివ్వక ఉద్యోగులకు వాతలు..మాటల్లో ఫేకుడు..ఢిల్లీకి వెళ్లి జోకుడు.. ఇదేనా మీకు తెలిసింది రేవంత్‌రెడ్డీ? అని హరీశ్ నిలదీశారు. జూలైలో మూడు వారాలు దాటినా రాత్రింబవళ్లు కాపలాకాసే హోంగార్డులకు వేతనాలివ్వకపోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ‘సార్.. మేం హోంగార్డులం..ఈ నెలలో ఇప్పటి వరకు ఖాతాల్లో వేతనాలు జమకాలేదు.
భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వికారాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్న మాకు వేతనాలు అందలేదని గగ్గోలు పెడుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు మిన్నకుంటున్నారు? పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం.. ఈఎంఐలు కట్టక చెక్‌బౌన్స్ అయి అష్టకష్టాలు పడుతున్నం.. ప్రతినెలా ఇదే దుస్థితి అని వాపోతున్న హోంగార్డుల ఆర్తనాదాలు మీకు వినిపిస్తలేవా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డే హాంమంత్రిగా వ్యవహరిస్తున్నా ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉంటే ఇతర శాఖల్లోని ఉద్యోగుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని చురకలంటించారు.