హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట అర్బన్ : ప్రజలకు కేసీఆర్ బతుకుదెరువు చూపిస్తే కాంగ్రెస్ వచ్చి ఆగం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో గంగమ్మ ఆలయ వార్షికోత్సవం, నారాయణరావుపేట మండలం గుర్రాలగొందిలో మహంకాళి ఉత్సవాల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు మూర్ఖులు హైదరాబాద్‌లో ఉండి కాళేశ్వరం గురించి చెడుగా మాట్లాడుతున్నారని, రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్ ద్వారా ఇక్కడి పొలాలు పారుతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డికి జ్ఞానం ఉన్నదో? లేదో? తెలియదని, కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరం పారలేదని అంటున్నారని మండిపడ్డారు. మరి ఇక్కడి చెరువుల్లోకి నీళ్లు ఎలా వచ్చాయని నిలదీశారు. కాళేశ్వరంపై మూర్ఖంగా దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలకు అన్ని విషయాలూ తెలుసునని పేర్కొన్నారు.
కేసీఆర్ లేని లోటును ప్రజలు గమనిస్తున్నారని, మళ్లీ బీఆర్ఎస్ రావాలని, కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నట్టున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ.1000 కోట్లతో గంపుత్రుల అభ్యున్నతికి కృషి చేశామని, కాలమైనా కాకపోయినా చెరువులను కాళేశ్వరం నీళ్లతో నింపామని గుర్తుచేశారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పిన వాడు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే అది రేవంత్‌రెడ్డేనని ఎద్దేవాచేశారు. దేవుళ్లనే మోసం చేసిన రేవంత్‌రెడ్డికి వృద్ధుల, ప్రజలను మోసం చేయడం ఓ లెక్కనా అని దెప్పిపొడిచారు. పంచాయతీ కార్మికులకు కూడా జీతాలివ్వలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయితే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరితే సీఎం పత్తా లేకుండా పోయాడని దుయ్యబట్టారు. బూతులు తిట్టడం తప్ప ఒక్క పనికొచ్చే పనైనా ఈ ముఖ్యమంత్రి చేశారా అని నిలదీశారు. సద్ది తిన్న రేవును తలువాలని, ఏడాదిన్నర అవుతున్నా ప్రజలకు కాంగ్రెస్ ఏమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు.
మహేశ్గౌడ్వి దిగజారుడు రాజకీయాలు
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్వి చిల్లర రాజకీయాలు అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సూటిగా ఎదురొనే ధైర్యం లేక ఆయన దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని శనివారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. విలువలకు తిలోదకాలిచ్చి రేవంత్ బాటలో టీపీసీసీ నేత నడుస్తున్నారని దుయ్యబట్టారు. బట్టకాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని దుయ్యబట్టారు. పెళ్లిలోనో.. చావులోనో కలిసిన సందర్భాలే తప్ప ఇతర పార్టీల నాయకులను, తమ పార్టీ నుంచి వెళ్లి పోయిన నాయకులను తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదని స్పష్టంచేశారు. ‘విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప మీలా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను’ అని ఫైర్ అయ్యారు. ఇలాంటి నిందారోపణలు మానుకొని స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని హితవుపలికారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.