Harish Rao | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథం వైపు కాకుండా పతనం వైపు తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం అనాలోచిత చర్యల కారణంగా రాష్ట్ర ఆదాయం రోజురోజుకు పడిపోతున్నదని మండిపడ్డారు. జీఎస్టీ వసూళ్ల ఆదాయం ఎన్నడూలేనంతగా తగ్గడం ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఆరేండ్లలో ఫిబ్రవరి నెల వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కలెక్షన్ వృద్ధిరేటు (2021 కరోనా సంవత్సరం మినహా) ఎప్పుడూ 6% కంటే ఎకువే నమోదైందని గుర్తుచేశారు.
కానీ, రేవంత్‌రెడ్డి పాలన కరోనా కాలాన్ని తలపిస్తూ జీఎస్టీ వసూళ్లు ఒక శాతానికి మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తికి ఇది అద్దం పడుతున్నదని మండిపడ్డారు. హైడ్రా, మూసీ వంటి తలాతోక లేని నిర్ణయాలు, అనాలోచిత చర్యల వల్ల ఆగస్టు 2024 తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిందని విమర్శించారు. 2024 ఏప్రిల్-నవంబర్, 2023 ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో వాహన విక్రయాలతో పోల్చితే-0.8% నమోదైందని పేర్కొన్నారు. జీఎస్టీ ఆదాయంలో తకువ వృద్ధి రేటు, రిజిస్ట్రేషన్లు, వెహికిల్ ట్యాక్స్‌లో నెగెటివ్ వృద్ధి రేటు.. రేవంత్‌రెడ్డి 15 నెలల పాలనా వైఫల్యాన్ని వెల్లడిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పి పాలనపై శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు.
పడకేసిన విదేశీవిద్య పథకం
తెలంగాణ విద్యార్థుల విదేశీ చదువుల కలలను రేవంత్‌రెడ్డి సర్కారు చెరిపివేస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. విదేశీవిద్య పథకం ఏడాదిగా పడకేసిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి, ఉన్నత చదువులు చదువాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక విద్యార్థిని కూడా ఈ పథకం కింద ఎంపిక చేయలేదని విమర్శించారు. ఏడాదిన్నరగా ప్రక్రియ దరఖాస్తుల దశలోనే నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో విదేశీవిద్య పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు సాలర్షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండటం, పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిందని మండిపడ్డారు. ఇదే విషయమై డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని, సాలర్షిప్స్ బకాయిల విడుదలకు మార్చి వరకు సమయం ఉన్నదని మంత్రి సీతక సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. ఈ మాట చెప్పి మూడు నెలలు అవుతున్నా ఇప్పటివరకు మూడు రూపాయల బకాయిలు కూడా చెల్లించిన దాఖలు లేవని మండిపడ్డారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి తక్షణమే సాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, విదేశీవిద్య పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి పేదలకు విదేశాల్లో చదివే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.