అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ఎందుకు ఓడించాలో ప్రజల వద్ద వంద కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీపై మాట తప్పినందుకు, రైతు భరోసాపై మాట తప్పినందుకు, రూ.500 బోనస్‌పై మాట తప్పినందుకు, ఆసరా పెన్షన్లపై మాట తప్పినందుకు, మహిళలకు రూ.2,500 సాయం అందించనందుకు, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తామని మాట తప్పినందుకు, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు.. కాంగ్రెస్‌ను ఓడించాలి. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఎందుకు చేయలేదు?
Harish Rao | నర్సాపూర్/సంగారెడ్డి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ‘పంద్రాగస్టులోపు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తవా? రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా?’ అని సీఎం రేవంత్‌కు మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లిలో, మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆగస్టు 15న రూ.39 వేల కోట్ల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేయకపోతే రేవంత్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతులందరికీ రైతుబంధు అందలేదని, ఇంకా రైతుబంధు ఇవ్వని రేవంత్‌రెడ్డి.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తారా? అని ఎద్దేవా చేశారు. దేవుళ్లను ఆడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయటం తగదని సీఎంకు హితవు పలికారు. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని ఎవరి చెవుల్లో పువ్వులు పెడతావని ప్రశ్నించారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తానని ఎందుకు చేయలేదని నిలదీశారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తం అవుతుందని హరీశ్ విమర్శించారు. ఎన్నికల్లో ఆ పార్టీకి చురక పెడితేనే ఆరు గ్యారెంటీలు అమలవుతాయని ప్రజలకు తెలిపారు. ‘ప్రజలకు ఇచ్చిన హామీలు మరచి కేసీఆర్‌ను తిడితే ఏమొస్తుంది? నీ(రేవంత్) మాటలే నీకు ఉరితాళ్లు అవుతాయి. కేసీఆర్‌ను తిట్టినా, దేవుళ్ల మీద ఒట్లు పెట్టినా ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించరు. కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పారు’ అని వెల్లడించారు. ప్రజలు, రైతులు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల ఉసురు తీసుకుంటున్న రేవంత్ సర్కార్‌కు ప్రజలు గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు. సీఎం అపాయింట్మెంట్ దొరకటం లేదని కాంగ్రెస్ సొం త నేతలు వీ హన్మంతరావు, మోత్కుపల్లి చెప్తున్నారని గుర్తుచేశారు.
సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నదని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మంచి చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలిచేవారని, దుబ్బాకను అభివృద్ధి చేయనందుకే ప్రజలు బుద్ధి చెప్పారని వెల్లడించారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వడ్లను కొనలేదని, నేడు ఏ ముఖం పెట్టుకొని బీజేపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వస్తున్నారని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఒక్క మేలైనా చేసిందా? అని ప్రశ్నించారు. అంబానీ, ఆదానీలకు రూ.13 లక్షల కోట్లు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం.. రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తెరిచిన పుస్తకమని ఉత్తమ అధికారిగా, మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా బెస్ట్ ఆర్అండ్ఆర్ కాలనీ కట్టించిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచిందని, మళ్లీ అదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశాల్లో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునితాలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, మాణిక్యం, దేశ్‌పాండే, రాజేందర్, సత్యంగౌడ్, సింగాయిపల్లి గోపి, బీఆర్ఎస్ యువ నాయకుడు సంతోష్‌రెడ్డి, వివిధ మండలాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి నాలుగున్నర నెలల పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని, కాంగ్రెస్ నేతల జీవితాల్లోనే మార్పులు వచ్చాయని హరీశ్‌రావు విమర్శించారు. సీఎం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నమ్మి ఓటు వేస్తే హామీలు నెరవేర్చకుండా రైతుల గుండె మీద తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు రైతుల ఆత్మహత్యలు, మరోవైపు పంటలు ఎండి అవస్థలు పడుతుంటే.. సీఎం, మంత్రులు ఇప్పటివరకు ఆ కుటుంబాలను పరామర్శించలేదని మండిపడ్డారు. కరీంనగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పాలనేమిటో ప్రజలకు అర్థమైందని, ఆ పార్టీకి బుద్ధి చెప్పటం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆదరణ ఇంకా తగ్గుతున్నదని వెల్లడించారు.