Harish Rao | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ) : ‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏటా రూ.41 వేల కోట్ల చొప్పున చేసిన అప్పు అక్షరాల రూ.4.17లక్షల కోట్లే.. ఇది కాగ్ రిపోర్ట్‌తోపాటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగంలో తేటతెల్లమైంది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ది గోబెల్స్ ప్రచారమని నిరూపితమైంది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ చేసిన అప్పులపై అబద్ధపు ప్రచారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో బీఆర్ఎస్ సఫలీకృతమైందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి పత్రికల్లో హెడ్లైన్లు, బ్రేకింగ్‌ల కోసమే మాట్లాడి సమావేశాలను సిల్లీగా తీసుకున్నారని విమర్శించారు. ‘కాంగ్రెస్ సర్కారు 15 నెలల్లో తెచ్చిన అప్పులు, ఖర్చులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తలోమాట చెప్పారు.
ఈ రోజు సీఎం 3:58 గంటలకు రూ.1.58 లక్షల కోట్లు అప్పులు చేసి అందులో రూ. 1.53 లక్షల కోట్లు అసలు, వడ్డీలు కట్టామని అన్నారు. కానీ, డిప్యూటీ సీఎం భట్టి రాత్రి 7:44 గంటలకు రూ.88 వేల కోట్లు అసలు, వడ్డీలకు చెల్లించామని చెప్పారు. ఇద్దరు కలిసి నాలుగు గంటల్లోనే రూ.70 వేల కోట్ల తేడా చూపారు’ అని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియాపాయింట్లో, అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడారు. ఈ బడ్జెట్ సమావేశాల సాక్షిగా కాంగ్రెస్ సభా సంప్రదాయాలను, విలువలను మంటగలిపిందని ధ్వజమెత్తారు. 11 రోజులు సభ నడిపి రెండురోజులే ప్రశ్నోత్తరాలు నిర్వహించడం ఇందుకు నిదర్శనమని అన్నారు. చర్చలు జరిగిన తీరు చూస్తే కేవలం బడ్జెట్ ఆమోదానికే సభను నిర్వహించినట్లు అర్థమవుతున్నదని అన్నారు. శాసనసభలో ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి సీఎం మాట్లాడిన తీరుపై సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్తామని హరీశ్ చెప్పారు.
కాంగ్రెస్ సర్కారు 15 నెలల్లో తెచ్చిన అప్పులు, ఖర్చులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తలోమాట చెప్పారు. ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి 3:58 గంటలకు రూ.1.58 లక్షల కోట్లు అప్పులు చేసి అందులో రూ.1.53 లక్షల కోట్లు అసలు, వడ్డీలు కట్టామని అన్నారు. కానీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాత్రి 7:44 గంటలకు రూ.88 వేల కోట్లు అసలు, వడ్డీలకు చెల్లించామని చెప్పారు. నాలుగు గంటల వ్యవధిలోనే ఇద్దరు కలిసి రూ. 70 వేల కోట్ల తేడా చూపారు.
సభ్యుల సస్పెన్షన్ విషయంలోనూ ప్రభుత్వం మాటతప్పిందని హరీశ్ విమర్శించారు. జగదీశ్‌రెడ్డిపై అకారణంగా వేటు వేసిందని అన్నారు. డీలిమిటేషన్‌పై కేటీఆర్‌కు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం తోకముడిచిందని దుయ్యబట్టారు. ఏ అంశాన్ని లేవనెత్తినా సరైనా సమాధానం ఇవ్వకుండా మంత్రులు దాటవేశారని చెప్పారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లకు గత బడ్జెట్లో రూ.22,500 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చుచేయలేదని విమర్శించారు. మైనార్టీలకు రూ.3,500 కోట్లు కేటాయించి రూ.1100 కోట్లే ఖర్చుచేసి వారిని నిలువునా ముంచిందని అన్నారు. కల్యాణలక్ష్మి తులంబంగారం, మహిళలకు స్కూటీలు, పింఛన్ల పెంపు ఇలా అనేక అంశాలపై కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ కడిగిపారేసిందని చెప్పారు. రోడ్ల నిర్మాణంపై ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి చెప్పిన తప్పుడు లెక్కలను ప్రశాంత్‌రెడ్డి విజయవంతంగా బట్టబయలు చేశారని ప్రశంసించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన మంత్రిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని తెలిపారు. ప్రొటోకాల్ ఉల్లంఘన విషయంలోనూ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మైత్రి బంధం బయటపడ్డదని హరీశ్‌రావు అన్నారు. ‘కాంగ్రెస్ ఏ పేపర్ ఇస్తే బీజేపీ వాళ్లు అదే మాట్లాడారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ పొగడ్తలు కురిపించుకున్నారు’ అని చెప్పారు. రాష్ట్రానికి నిధులివ్వకుండా మోసం చేసిన మోదీ సర్కారును అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పల్లెత్తుమాట అనలేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్ల పాలనలో రూ.125 లక్షల కోట్లు అప్పులు చేసిన విషయాన్ని విస్మరించి ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఇక్కడ అప్పుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. వారు చేసిన అప్పు దేశ జీడీపీలో 57 శాతమని, అదే బీఆర్ఎస్ పదేండ్లలో చేసిన అప్పు జీఎస్డీపీలో కేవలం 27 శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి అన్యాయమే జరిగిందనే విషయాన్ని కేటీఆర్ సోదాహరణంగా ఎత్తిచూపారని తెలిపారు.
ప్రాజెక్టుల పూర్తి, పురోగతిపై మంత్రి ఉత్తమ్‌ను లెక్క అడిగితే నీళ్లు నమిలారని హరీశ్ ఎద్దేవా చేశారు. నిరుడు ఆరు ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పారని, ఒక్కటి కూడా పూర్తిచేయకుండానే మళ్లీ ఇప్పుడు 12 ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. ఉత్తమ్‌తోపాటు మంత్రులందరూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని మండిపడ్డారు.
శాసనసభ లోపల ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు సీట్ల వద్దకు వెళ్లి హరీశ్ కాగ్ రిపోర్టులో అప్పుల గురించి ఏమున్నదో వివరించి చెప్పారు. మంత్రులు అప్పుల విషయంలో తప్పులు చెప్తున్నారని, వారికి ఆధారాలను ఇచ్చారు. కాగ్‌లో ఉన్న అంశాలనే వివరించి చెప్పారు.
రుణమాఫీపై కాంగ్రెస్ ఆడిన దాగుడుమూతలు రైతులోకానికి తెలిసిపోయాయని హరీశ్‌రావు చెప్పారు. బడ్జెట్లో రూ.31వేల కోట్లు కేటాయించి కేవలం రూ.20 వేల కోట్లే ఖర్చు చేసి అన్నదాతను నిలువునా మోసం చేసిందని దుయ్యబట్టారు. ఇందులోనూ వానకాలంలో రూ.8 వేల కోట్లు, యాసంగిలో రూ.4 వేల కోట్లు రైతుబంధు ఎగ్గొట్టి ఈ నిధులను రుణమాఫీకి మళ్లించిందని, అంటే కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందని వివరించారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్, లేదంటే తన నియోజకవర్గం సిరిసిల్లలో నిరూపించేందుకు సిద్ధమని కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా పారిపోయిందని అన్నారు