బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నడు. బీసీలకు అన్ని విధాలా న్యాయం చేసింది కేసీఆర్ ఒక్కరే. మార్కెట్ కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు తెచ్చింది కేసీఆరే.. దవాఖానల కాంట్రాక్టులు, ఇరిగేషన్ పనులు, వైన్‌షాపుల్లో రిజర్వేషన్ కల్పించింది కేసీఆరే. రేవంత్ సర్కారు కనీసం గొల్లకుర్మలకు గొర్రెలను కూడా పంపిణీ చేస్తలేదు. గంగపుత్రులు, ముదిరాజ్‌ల కోసం చెరువుల్లో చేపలు వేస్తలేదు.
– హరీశ్
సంగారెడ్డి అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డీ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టును మీ తాత కట్టిండా? మీ అయ్య కట్టిండా? మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగం.. కాళేశ్వరం కేసీఆర్ చెమటచుక్కల్లోంచి వచ్చిన ప్రాజెక్టు.. అలాంటి ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూనే మల్లన్నసాగర్ నుంచి రూ.8 వేల కోట్లతో హైదరాబాద్‌కు నీళ్లు తీసుకుపోతానంటవా? ఎవరి చెవుల్లో పూలు పెడదామనుకుంటున్నవ్? నువ్వు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా ప్రజలు నమ్మరు’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పోయి.. మళ్లీ కేసీఆర్ రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నదని చెప్పారు. అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో జరిగిన ఆలయ్బలయ్ కార్యక్రమంలో హరీశ్ మాట్లాడారు.
ఆరు గ్యారెంటీలతో గారడీ చేసి అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.1.50 లక్షల కోట్లతో ఫ్యూచర్‌సిటీ, రూ.5 వేల కోట్లతో రోడ్డు, లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ, రూ.8 వేల కోట్లతో మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తానని చెప్తున్న రేవంత్‌రెడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం రోడ్లు ఎందుకు వేయటం లేదని ప్రశ్నించారు. కమీషన్లు వచ్చే పనులనే చేస్తున్న రేవంత్‌రెడ్డి, ప్రజలకు పనికొచ్చే పనులను మాత్రం చేయడం లేదని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను రైతులు, మహిళలు, మైనార్టీలు నిలదీయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, రాష్ట్రంలోని అన్ని జడ్పీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని స్పష్టంచేశారు. సర్వేలు కూడా ఇదే విషయం చెప్తున్నాయని వెల్లడించారు.
బీసీలకు రేవంత్ మోసం
42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీసీలను రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఊగిసలాట కొనసాగుతున్నదని చెప్పారు. రేవంత్‌రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అవకాశమే కనిపించటం లేదని తెలిపారు. బీసీలకు అన్ని విధాలా న్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. గీతకార్మికులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించారని చెప్పారు. వైన్‌షాపుల్లో గీతకార్మికులకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రేవంత్‌రెడ్డి మోసం చేశాడని విమర్శించారు. ఈ విషయమై ప్రభుత్వాన్ని గీతకార్మికులు నిలదీస్తే ఊల్టా కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వడ్లకు మద్దతు ధర విషయంలో బీజేపీ అన్యాయం చేస్తున్నదని, కేవలం ఉత్తర భారదేశం కోసమే ఆ పార్టీ పనిచేస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలకు పేగు బంధం ఉంటుందని, కేసీఆర్ ఒక్కరే తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టంచేశారు. తెలంగాణలోని అన్నివర్గాల ప్రజల కోసం కేసీఆర్ ఆలోచిస్తే రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు మోయడంపైనే దృష్టిపెట్టారని ఎద్దేవాచేశారు. పోలీసులు బెదిరించినా.. అక్రమంగా కేసులు బనాయించినా వారి పేర్లు పింక్ బుక్కులో రాసిపెట్టుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చెప్తామని హెచ్చరించారు. ‘ఇప్పుడు ఎవర్ని కదిలించినా ఒక్కటే చెప్తున్నరు.. అది రేవంత్‌రెడ్డికి అర్థమైందో? లేదో? తెల్వది. ఎవరిని కదిపినా కేసీఆరే కావాలంటున్నరు. తెలంగాణ పార్టీ ఉంటేనే మంచిదంటున్నారు’ అని వివరించారు.
సాగునీటి పథకాల కోసం పాదయాత్ర
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర పథకాలకు శ్రీకారం చుడితే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని బంద్ పెట్టిందని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లాలోని అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించే ఈ పథకాలకు కేసీఆర్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ రాగానే రెండు ఎత్తిపోతల పథకాల పనులను నిలిపివేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా పనులను వెంటనే ప్రారంభించపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డితో కలిసి సంగమేశ్వ, బసవేశ్వర పథకాల కోసం రైతుల పక్షాన పాదయాత్ర చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, మామిళ్ల రాజేందర్, పద్మావతి, ఆదర్శ్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, రాహుల్ కిరణ్ పాల్గొన్నారు.
సంగారెడ్డి నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించే సంగమేశ్వర, బసవేశ్వర పథకాలకు కేసీఆర్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే కాంగ్రెస్ వచ్చాక నిలిపివేసింది. నీళ్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. సంగమేశ్వర, బసవేశ్వర పథకాల పనులను వెంటనే ప్రారంభించకుంటే ఊరుకునేదిలేదు. రైతుల పక్షాన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేస్తం. ప్రభుత్వం మెడలు వంచి పనులు పూర్తయ్యేలా చూస్తం. -హరీశ్