వరంగల్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవాల పేరుతో వరంగల్‌లో నిర్వహించిన సభ పూర్తిగా వంచన సభ అని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకానికి చేసిన, చేస్తున్న ద్రోహానికి… ప్రత్యేకించి మహిళలకు రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు టీ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్‌తో కలిసి మధుసూదనాచారి బుధవారం హనుమకొండలోని ఎర్రబెల్లి నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మీ గ్యారెంటీ అని, మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇస్తామని ఇప్పటికీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. 18 ఏండ్లు నిండి చదువుకునే ప్రతి విద్యార్థినికీ ఎలక్ట్రిక్ సూటర్లు ఇస్తామని చెప్పి మహిళా సభలో కనీసం ప్రస్తావించ లేదని మండిపడ్డారు.
ప్రతి నిరుపేద ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయలతోపాటు ఇందిరమ్మ కానుక తులం బంగారం ఇస్తామని మోసం చేశారని చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.4.25 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని, కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో ఉత్పాదక, సంపదను పెంచి తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే 11 నెలల పాలనలో రూ.85 వేల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఘోర వైఫల్యానికి, అవగాహన, అనుభవ రాహిత్యానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, సహచర మంత్రుల్లో సీఎంపై అసహనం పెరిగిపోతున్నదని, రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత, దీనికితోడు సొంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటు మొదలైందని వివరించారు. ముఖ్యమంత్రులను మార్చే అలవాటున్న కాంగ్రెస్ సంస్కృతితో రేవంత్‌రెడ్డి పదవి తుమ్మితే ఊడే ముకేనని, దీనస్థితిలో ఉన్న రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 25 ఏండ్లలో తెలంగాణ నలుమూలల వటవృక్షంలా వేళ్లూనుకున్న నాయకుడిని మొలకెత్తనివ్వ అనడం చూస్తే పిట్టల దొరకు రేవంత్‌రెడ్డికి తేడా లేదని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని సిరికొండ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థాయి దిగజారి నీచంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి తెలంగాణలో గంజాయి మొక్క అని, ప్రజలే ఆ మొక్కను పీకి అవతల పడేస్తారని చెప్పారు. రేవంత్‌రెడ్డిని సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే పట్టించుకోవడం లేదని, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు.
మంత్రివర్గ విస్తరణ సైతం చేయలేని అసమర్థుడు రేవంత్‌రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి సోయి లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఓటమి ఎరుగని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు గురించి మాట్లాడే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదని చెప్పారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పదేండ్లలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను పీకి పారేస్తా అనడం రేవంత్‌రెడ్డి చిల్లర చేష్టలకు నిదర్శనమని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి చీటర్, బ్రోకర్ అని, అబద్ధాలు, మోసపు మాటలతో అధికారంలోకి వచ్చాడని దుయ్యబట్టారు. వరంగల్ బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి తనను రాక్షసుడు అన్నారని, ప్రజల కోసం రాక్షసుడిలానే పని చేస్తానని దయాకర్‌రావు స్పష్టంచేశారు. ప్రజలు తనను ఏడుసార్లు వరుసగా గెలిపించారని, రేవంత్‌రెడ్డి ప్రతిసారి సీటు మారిస్తేనే గెలుస్తాడని ఎద్దేవా చేశారు. విజయోత్సవ సభలు పెట్టడం తర్వాత అని, మొదట కొడంగల్ నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకోవాలని హితవు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనంటూ ప్రజలను గాలికి వదిలేసిందని విమర్శించారు. కాళోజీ గురించి ఏం తెలుసని రేవంత్‌రెడ్డి మాట్లాడారని, వ్యక్తిగతంగా ఎప్పుడైనా కనీసం కలిశాడా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో రేవంత్‌రెడ్డి దుష్టపాలన కొనసాగిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. వరంగల్ మహిళా సభలో రేవంత్‌రెడ్డి బూతు పురాణం చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతాయనే ఆశతో సభకు వచ్చిన మహిళలను మరోసారి గోసపెట్టారని దుయ్యబట్టారు. కాళోజీ చరిత్రను అర్థం చేసుకోవడం రేవంత్‌రెడ్డి అజ్ఞానానికి సాధ్యం కాదని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ వ్యవసారంగాన్ని అభివృద్ది చేస్తే..
రేవంత్‌రెడ్డి రైతులకు మోసం చేశాడని తెలిపారు. పాలన ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్‌లో రేవంత్‌రెడ్డికి హిట్లర్, ముస్సోలిని, డయ్యర్‌కు పట్టిన గతే పడుతుందని పల్లా హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి తన అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ వదిలిపెట్టి.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి ముగ్గురు కలిసి ఆంబోతుల్లా రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. 15 శాతం కమీషన్లు ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే బెల్ట్‌షాపులను మూయించాలని సవాల్ విసిరారు. గ్రామాల్లో గుడుంబా ఏరులై పారుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో కేసీఆర్ అనే మహా వృక్షం నీడ ఎప్పుడూ రేవంత్‌రెడ్డిని వెంటాడుతుందని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి కూర్చున్న కుర్చీలోనూ ఆయనకు కేసీఆరే కనిపిస్తాడని, ఓరుగల్లు నుంచే రేవంత్‌రెడ్డి పతనం మొదలైతదని చెప్పారు. అసెంబ్లీలో తమనే తట్టుకోలేని రేవంత్‌రెడ్డి.. ఇక కేసీఆర్ వస్తే ఏం తట్టుకుంటాడని పల్లా సెటైర్లు వేశారు.