దేవరుప్పుల, జనవరి 15: బీఆర్ఎస్ నేతల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడానికి సీఎం రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ల పేరిట చేస్తున్న చిల్లర చేష్టలను ప్రజలు ఏవగించుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్ ఫిరాయింపు రాజకీయాలను ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఒక ప్రకటనలో ఆరోపించారు.
డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడమే ఏడో గ్యారెంటీ పథకంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడం చేతకాక అణచివేతకు పాల్పడటం అప్రజాస్వామికమని మండిపడ్డారు. పూటకో కేసు, రోజుకో అరెస్ట్ తీరుగా పాలన సాగిస్తున్న రేవంత్ సర్కారు తీరును ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. కౌశిక్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.