కరీమాబాద్, జూన్ 28 : కాంగ్రెసోళ్లకు మళ్లీ అధికారంలోకి వస్తమనే నమ్మకం లేకుండా పోయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అందుకే ముఖ్యమంత్రి దగ్గరి నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ అందినకాడికి దోచుకుంటున్నరని విమర్శించారు. శనివారం వరంగల్ నగరంలోని ఉర్సుగుట్టలో వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూడుసార్లు గెలిచినోడు ముఖ్యమంత్రి కాంగనే ఏడుసార్లు గెలిచిన వారిని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌కు ఢిల్లీలో పతార లేదని, వందసార్లు పోయినా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడని కాంగ్రెస్‌వాళ్లే చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఓ దారి, మంత్రులది మరో దారి అన్నట్టు వ్యవహారం నడుస్తున్నదని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు రంగు బయటపడుతుందని చెప్పారు. రైతులకు ఏడాది రైతుబంధు ఎగ్గొట్టి సిగ్గులేకుండా సంబురాలు చేసుకుంటారా? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.