Errabelli Dayakar Rao | ప్రజలతో ఓట్లేసి గెలిపించుకొని ఏ పనులు చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త ముందుకు వెళ్లాలన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో విజయం మనదేనన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానన్నారు.
కర్కాలకు కనీసం సాగునీరివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కర్కాల వంతెన పనులు ఎందుకు నిలిచిపోయాయని ప్రశ్నించారు. తొర్రూరు వంద పడకల ఆసుపత్రికి ఎక్కడికి వెళ్లిందని నిలదీశారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఎక్కడ పోయిందని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇంకా అబద్ధాలతోనే కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీసీటీలు, జడ్పీటీసీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలువబోతుందన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో పంచిన గ్యారంటీ కార్డులు ఎక్కడ పోయాయని దయాకర్‌రావు ప్రశ్నించారు. 420 హామీల అమలు 420 కింద పోయినట్టేనా? అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని గ్రామసభలు పెట్టి గ్రామాల్లో అలుజడలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు చేసినా సర్వేలు.. ఉత్తవైన ఇదేనా ప్రజాపాలన అంటూ ఎద్దేవా చేశారు. కనీసం రైతులకు నీళ్లు ఇచ్చే దిక్కు లేదు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. స్థానిక ఎన్నికలు ఉన్నాయనే ఈ ప్రభుత్వం మళ్లీ ప్రజలను పక్క దారి పట్టిస్తుందని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు.
ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయని లీడర్లకు గాళం వేసి పార్టీలో జాయినింగ్ చేసుకుంటున్నారన్నారు. పాలనా కాలంలో వెంట తిరిగిన వారు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారన్నారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు తిరుగుతున్నానని, పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, సంకల్పాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ.. గత 14 నెలల్లో అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించామన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేశామని.. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవేవీ చేతకావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని.. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయడం లేదని మండిపడ్డారు. సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదని.. వారికి ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. మాజీ సర్పంచ్ల బిల్లులు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. ప్రభుత్వంలో అసమ్మతి పెరుగుతోందని, 25 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని, ప్రభుత్వం కూలిపోయేందుకు ఇదే తొలి సంకేతమన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.