రేవంత్‌రెడ్డి పాలనలో 22శాతం క్రైమ్ రేట్ పెరిగిందని స్వయంగా డీజీపీ చెప్పారు. నువ్వు హోం మంత్రిగా పనికిరావని నీ డీజీపీయే చెప్తున్నరు. రేవంత్‌రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి. సీఎంకు కమీషన్ల మీద ఉన్న ఆసక్తి పాలనపై లేదు.
పోయిన నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లకు విడుదల చేసిన బిల్లులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. పిల్లల చదువులు ముఖ్యమా? కాంట్రాక్టర్ల కమీషన్లు ముఖ్యమా?.
-హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు +33%తో దేశంలోనే నంబర్ వన్‌గా దూసుకెళ్తే, రేవంత్‌రెడ్డి పాలనలో మైనస్ 5 శాతానికి పడిపోయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర సెప్టెంబర్ నెల జీఎస్టీ వృద్ధిరేటు మైనస్ 5 శాతానికి పడిపోయిందని, దేశంలోని 28 రాష్ర్టాల్లో తెలంగాణ కింది నుంచి నాలుగో స్థానంలో ఉన్నదని వివరించారు. ఇవి తన సొంత లెక్కలు కావని, కాగ్ చెప్పిన లెక్కలని స్పష్టంచేశారు. హైడ్రా వల్ల, తుగ్లక్ చర్యల వల్ల, భూ దందాలు, వేధింపుల వల్ల, వసూళ్ల వల్ల రాష్ట్ర ఆర్థికరంగం తిరోగమనం పాలవుతున్నదని విమర్శించారు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల ఆదాయం, రోడ్ ట్యాక్స్ ఆదాయం కూడా తగ్గిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గడంపై రివ్యూ చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి చురకలు అంటించారు.
తెలంగాణభవన్‌లో శనివారం ఆయన మాజీ మంత్రులు మంత్రి లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పార్టీ నేత నగేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కమీషన్ల మీద ఉన్న ఆసక్తి పాలనపై లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మందిని తొక్కుడు.. మాట తప్పుడు.. ఇదే రేవంత్ నైజమని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తినే కంచంలో ఊంచే రకమని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులు తొకినా గెలవదని తేలిపోవడంతో ఆ ఫ్రస్టేషన్‌తో అడ్డమైన చెత్త మాట్లాడారని విమర్శించారు. ప్రభుత్వాన్ని నడపడం తమకు చేతకావడం లేదని ముఖ్యమంత్రి మాటల్లో తేలిపోయిందని, అసమర్థతను చెప్పకనే చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. రెండేండ్లలో పాలనలో చేసిందేమీ లేక 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన చూసి ఓటు వేయాలని అడగడమే ఇందుకు నిదర్శమని చెప్పారు. ఆ రోజు టీడీపీ నేతగా ఉండి, కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలని హితవుపలికారు.
కేసీఆర్ ముద్రను చెరపడం నీ జేజమ్మతో కూడా కాదు
హైదరాబాద్‌కు కేసీఆర్ ఏం చేశారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించడంపై హరీశ్‌రావు భగ్గుమన్నారు. హైదరాబాద్‌పై కేసీఆర్ ముద్రను చెరపడం నీ జేజమ్మతో కూడా కాదని వ్యాఖ్యానించారు. ‘జూబ్లీహిల్స్ ప్యాలెస్ కిటికీలో నుంచి చూస్తే నీకు కనపడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా? రోజూ మీ ఇంటికి వెళ్లేటప్పుడు కనిపించే టీ హబ్, కేబుల్ బ్రిడ్జి కట్టిందెవరు? ప్రగతిభవన్ కట్టింది ఎవరు? అక్కడికి వెళ్లకుండా.. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రూ.100 కోట్లతో రేవంత్‌రెడ్డి కొత్త నివాసం నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎస్టీపీలు కట్టింది ఎవరు?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినా ఇండ్లలోకి నీళ్లు రాకుండా ప్రణాళిక చేసి ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలాల్లో పూడిక తీయకపోవడం వల్ల బస్తీలో నీళ్లు వచ్చి ఇండ్లు మునిగిపోయాయని, వరదలకు రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు సిద్ధమా?
విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా రేవంత్‌రెడ్డి? అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగినందుకు ప్రైవేట్ కాలేజీలపై దాడులు చేస్తరా? రూ.3,600 కోట్ల బకాయిలు ఉన్నాయని మాత్రమే ముఖ్యమంత్రి చెప్పారు. కానీ, రూ.8,000 కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. కరోనా వచ్చినా రూ.2,508 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది. ఈ రెండేండ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. డీఏలు అడిగితే ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి భయపెడుతున్నారు’ అని హరీశ్‌రావు విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఊకదంపుడు ఉపన్యాసమే తప్ప, అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అని నిలదీశారు. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక పనీ చేయడని విమర్శించారు. పేద ప్రజల కన్నీళ్లు తుడిచే ఒక ప్రణాళికైనా ఈ ప్రభుత్వానికి ఉన్నదా? అని నిలదీశారు.
మంత్రమేస్తే దిగుబడి రాదు రేవంత్!
తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో 68 లక్షల టన్ను ధాన్యం ఉత్పత్తి జరిగితే, 2023లో 2.73 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. మంత్రమేస్తే ఇంత దిగుబడి రాలేదని, పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించి, 24 గంటల కరెంట్ ఇచ్చి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీసి పంట దిగుబడులు పెంచామని స్పష్టంచేశారు. ‘కాళేశ్వరం కూలిందంటారు. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు 20 టీఎంసీల గోదావరి జలాల తరలించే ప్రణాళిక చేశామని ముఖ్యమంత్రి చెబుతారు. మల్లన్నసాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? రూ.7,000 కోట్లతో హైదరాబాద్‌కు గోదావరి జలాలను ఎలా తెస్తావు? కాళేశ్వరం అంటే అనేక పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, ఇవన్నీ కూలినయా? కనిపించడం లేదా రేవంత్‌రెడ్డీ? ఈ రిజర్వాయర్ల కింద పంట పండడం లేదా? పంట పండేది నిజం. రైతుల కండ్లల్లో ఆనందం నిజం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రేవంత్‌కు తెలంగాణ సోయిలేదు
‘రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి తెలవదు.. తెలంగాణ సోయిలేదు. సచివాలయం ఎందుకు నిర్మించామో ఆయనకు అర్థం కాదు. అది తెలంగాణ షాన్. అంబేదర్ పేరు ఉన్నదని సెక్రటేరియట్‌కి రేవంత్‌రెడ్డి పోవడం లేదు. తెలంగాణ ప్రతిష్ఠ పెరిగే విధంగా పరిపాలన సౌధాన్ని నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని సచివాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేసిన ఏకైక ప్రభుత్వం మీదే కావచ్చు. 10%, 20% కమీషన్ల కోసం పైరవీకారులు, బ్రోకర్లు సెక్రటేరియట్లో నిండిపోయారు’ అని హరీశ్‌రావు విమర్శించారు.
రేవంత్‌ది నోరా? మోరా?
రెండేండ్లలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పడంపై హరీశ్‌రావు ఫైరయ్యారు. అది నోరా? మోరా? దానిని ఫినాయిల్‌తో కడగాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్ టీఎస్‌ఐపాస్‌లో రెండేండ్లలో వచ్చిన పెట్టుబడుల వివరాలు ఉన్నాయని, ఈ ప్రింట్ తీసుకొచ్చానని మీడియాకు చూపించారు. 2024-25లో రూ.13,700 కోట్లు, 2025-26లో ఇప్పటివరకు రూ.6,472 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని స్పష్టంచేశారు. సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వస్తే రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఎకడివి? అని ప్రశ్నించారు. సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం చేతగాని ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.
పైసలు పంచినా కాంగ్రెస్ గెలువదు
సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైందని హరీశ్‌రావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు మల్టీనేషనల్ కంపెనీలు రాష్ర్టానికి క్యూ కడితే.. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లో నిలబడే దుస్థితి దాపురించిందని చెప్పారు. ‘రౌడీలు పోలీసుల గుండెల మీద బుల్లెట్లు దింపేది ప్రజలకు అర్థమైంది. జూబ్లీహిల్స్ ఓటర్లు లైన్లు కట్టి పొద్దున్నే పోయి కారు గుర్తుకు ఓటేయాలని డిసైడ్ అయ్యారు. ‘వేంకటేశ్వర కల్యాణం పేరిట జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ చీరలు పంచుతున్నది. చీరలు పంచినా, సారెలు పంచినా, పైసలు పంచినా నడువై రేవంత్‌రెడ్డి. జూబ్లీహిల్స్లోనే ఇప్పుడు ఎందుకు చీరెలు పంచుతున్నరు? సనత్నగర్లోనో, మరో ప్రాంతంలోనో ఎందుకు పంచడం లేదు? అంటే వారికి ఓటమి తప్పదని అర్థమైపోయింది’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో అప్పు 2.8 లక్షల కోట్లే
కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిన అప్పు రూ.2,80,000 కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. కేసీఆర్ రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పు ఎంతని 2025 ఆగస్టు 11న బీజేపీ ఎంపీ రఘునందన్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్రం రూ.2,80,000 కోట్లు మాత్రమేనని స్పష్టంచేసిందని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,47,000కు పెరిగిందని, భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. 2014లో తాము అధికారం స్వీకరించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రూ.62,000 కోట్లు ఉంటే, 2023లో రూ.2,30,000 కోట్ల ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టామని గుర్తుచేశారు. రెండేండ్లు కరోనా మహమ్మారి వచ్చినా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ నాలుగు రెట్లు పెంచామని, రేవంత్‌రెడ్డి రెండేండ్లలో మైనస్ చేశారని విమర్శించారు. రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం చేతగాని రేవంత్‌రెడ్డి సర్కారు.. గత ప్రభుత్వం అప్పులు చేసిందని అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు
ఢిల్లీలో భట్టి ఇంట్లో ఐటీ దాడులు
బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలోని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారకు చెందిన ఇంట్లో ఇటీవల ఐటీ రైడ్స్ జరిగాయని హరీశ్‌రావు చెప్పారు. ‘గుర్గావ్లోని భట్టి ఇంట్లో, అత్తగారి ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్ విషయం ఎందుకు బయటకు రాలేదు. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వంగానీ, ఐటీ అధికారులుగానీ ఎందుకు వెల్లడించలేదు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఏమిటి? మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్ అయితే ఎందుకు చెప్పలేదు? ఎందుకు వివరాలు వెల్లడించలేదు?’ అని ప్రశ్నించారు. దీనిని బట్టి రేవంత్‌కు బీజేపీతో చీకటి ఒప్పందం ఉన్నదని అర్థమవుతున్నదని చెప్పారు. ‘కిషన్‌రెడ్డిది రేవంత్‌ది ఫెవికాల్ బంధం. ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉంటే ఎందుకు విచారణ జరగడం లేదు. బీజేపీతో రేవంత్‌కు చీకటి ఒప్పందాలు ఉన్నాయి. అవి ఇప్పుడు బయటపడ్డాయి’ అని విమర్శించారు. పైగా దొంగే దొంగ.. దొంగ అన్నట్టుగా రేవంత్ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అంటున్నారని మండిపడ్డారు.