హైదరాబాద్/మెదక్ (నమస్తే తెలంగాణ)/పాపన్నపేట, అక్టోబర్ 13: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక వినూత్న పథకాలను కేంద్రం, ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని యూసూఫ్పేటలో జరిగిన కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, మెదక్ పట్టణంలో పీసీసీ అధికార ప్రతినిధి, 5వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ను వీడి మంత్రి హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చాలా మంది కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కంటివెలుగు కార్యక్రమాన్ని కేరళ, పంజాబ్, ఢిల్లీ సీఎంలు సైతం ప్రశంసించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వేరే పార్టీని గెలిపిస్తే కరెంటు కష్టాలు తప్పవని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి కరెంటు కష్టాలు మొదలయ్యాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తిరుపతిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పట్లోళ్ల శశిధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్కేభవన్ వద్ద మీడియా తో మాట్లాడుతూ.. రేవంత్, అప్పటి రా ష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మా ణిక్యం ఠాకూర్ వ్యవహారశైలిపై కాంగ్రెస్ పెద్దలకు వివరించినా, వారు పట్టించుకోలేదని తెలిపారు. పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేను కలిసి వినతిపత్రం ఇస్తే కేసీ వేణుగోపాల్ పట్టించుకోలేదని, రాహుల్‌గాంధీని కలిసి చెప్పాలని స్పష్టం చేశారని వివరించారు. రాహుల్‌గాంధీ కొందరి చేతిలో బందీ అయ్యారని వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యతో పాటు చాలా మంది కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఆ పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నదని పేర్కొన్నారు.