జనగామ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గతంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలు నేడు కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.
‘ రాష్ట్రంలో యాదాద్రి మాత్రమే కాదు. వేములవాడ, పాలకుర్తి, భద్రకాళి, ఐలోని, కొమురవెల్లి, సన్నూరు, నాంచారి మడూరు, తదితర పురాతన, కాకతీయ కాలం నాటి దేవాలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ జరుగుతుందన్నా’రు. ‘ధూప దీప నైవేద్యాలకు నోచని చిన్న చిన్న గుడులు, గోపురాలు కూడా కళకళలాడుతున్నాయి. భక్తులరాకతో కిటకిటలాడుతున్నాయ’ని అని మంత్రి వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పాలకుర్తి, బమ్మెర, వల్మీడి కారిడార్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఈ మూడు దేవాలయాలను రూ.62. 50 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 150 కోట్లతో పాలకుర్తి చుట్టూ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు వంటి వాటితో పాలకుర్తి అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు.
ఆలయ నూతన పాలక వర్గం ప్రమాణం
శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన కమిటీ శుక్రవారం పదవీ ప్రమాణం చేసింది. చైర్మన్ గా వెనక దాసుల రామచంద్రయ్య శర్మ, ధర్మకర్తలుగా కే.నరసింహారెడ్డి, చాలువాది సత్యనారాయణ, బజ్జూరి వేణుగోపాల్, కోటగిరి కుమారస్వామి, తీగల సత్తయ్య, కర్నే రమేశ్, కలుసాని ఉప్పల్ రెడ్డి, దుబ్బాక భాస్కర్ రెడ్డి, ధారావత్యా కూబ్ నాయక్, దౌపాటి నరసయ్య, చిదురాల సంధ్యారాణి, చిక్కుడు రాములు పదవీ ప్రమాణం చేశారు. ముందుగా మంత్రి ఎర్రబెల్లి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాగా అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.