మెదక్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ): ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు బీజేపీతో కుస్తీ పడుతుండగా రాష్ట్రంలో మున్సినల్ చైర్మన్ ఎన్నికల్లో దోస్తానా చేసి బీఆర్ఎస్ సభ్యులు చైర్పర్సన్లుగా ఎన్నిక కాకుండా కుట్ర చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు. మెదక్, నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సభ్యులు ఎన్నిక కాకుండా కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపి పదవులు పంచుకున్నాయని విమర్శించారు. మెదక్, నర్సాపూర్‌లో పోలీసుల అండ, అధికార బలంతో సభ్యుల సంఖ్య లేకపోయినా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మద్దతుతో చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్నదని ఆరోపించారు.
మెదక్‌లో జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ సభ్యులు కోరం కోసం ఉండి, చైర్మన్ ఎన్నిక సమయంలో బయటకు పోయారని విమర్శించారు. బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు పొందిందని దుయ్యబట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీఎస్పీ ఉద్యమాలు చేస్తే, మెదక్‌లో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ కలిసి బీఆర్ఎస్ సభ్యులు చైర్‌పర్సన్‌గా ఎన్నిక కాకుండా కుట్ర చేశాయని విమర్శించారు. మెదక్‌లో కాంగ్రెస్ రౌడీ రాజ్యం నడిపిస్తున్నదని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని ఎద్దేవాచేశారు.