మహబూబ్‌నగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నువ్వు చెప్పేది నేను వినను.. నేను చెప్పిందే వినాలి.. విజయ్ గాని.. ప్రకాశ్ గాని.. వాళ్ల బండ్లు గాని కనిపిస్తే మా వాళ్లు వచ్చి గు.. పగులగొడ్తరు’ అని జాతీయ రహదారి కాంట్రాక్టర్‌ను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. కొన్నిరోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారుల విస్తరణ పనులను ఓ మాజీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్న విషయం ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది.
తనకు రూ.8 కోట్లు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరింపులకు గురి చేసినట్టు ఏకంగా కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా కాంగ్రెస్ నేతలు పనులను ఎక్కడికక్కడే నిలిపి వేయించారు. అంతేకాకుండా పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి భయభ్రాంతులకు గురిచేసి అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసి సిబ్బందిని బెదిరించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో తాను ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని మాజీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి బెదిరించిన ఆడియో బయటికి వచ్చింది. విస్తరణ పనులు జరగాలంటే కమీషన్ ఇవ్వాల్సిందేనని అడిగినట్టు ఆడియోలో స్పష్టంగా తెలుస్తున్నది.
ఆడియోలో ఏమున్నదంటే..
కాంట్రాక్టర్ ఫోన్లో మాట్లాడుతూ ‘మొన్న మీరు చెప్పారు కదా 29కు ఆ సాయిల్ టైం అయిపోతుంది’ అనగానే వెంటనే మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘29 లేదు ఏమీ లేదు.. రేపటి నుంచి అక్కడ (పనుల వద్ద) విజయ్ గాని, ప్రకాశ్ గాని, వాళ్ల మెటీరియల్ గాని, బండ్లు గాని కనిపిస్తే బాగుండదు.. వాళ్ల మాటలు జర వేరే ఉన్నయి !.. పగుల్తదని చెప్పు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ‘అది కాదన్నా’ అంటూ కాంట్రాక్టర్ వేడుకుంటూ ‘నేను విజయ్‌కి ఏమి చెప్పానంటే’ అంటుండగానే మాజీ ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ‘చూడు శ్రీనివాస్‌రావు.. నువ్వు చెప్పేది నేనేం వినను.. రేపట్నుంచి వాళ్లు కనబడొద్దు’ అంటూ హుకుం జారీ చేశారు. కాగా ఆడియోలో ఉన్నది కాంట్రాక్టరా? లేక మధ్యవర్తా? బెదిరిస్తున్నది కాంట్రాక్టర్ మనుషులనా? అనేది తేలాల్సి ఉన్నది. అడిగినంత కమిషన్ ఇవ్వాల్సిందేనని, అందుకే అక్కడ ఎవరూ ఉండొద్దని వార్నింగ్ ఇస్తున్నట్టుగానే ఆడియోలో ఉన్నది. కాగా జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు మాత్రం ఈ వ్యవహారంపై మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.