కాజీపేట, జూన్ 19: పేదల జోలికి ఎవరూ రావొద్దని, గుడిసెవాసులకు సర్కారు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. శుక్రవారం కాజీపేట పట్టణం 62వ డివిజన్లోని రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో వైఎస్సార్‌నగర్ గుడిసెవాసులు, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేశానని, భద్రకాళీ ఆలయ అభివృద్ధి పనులకు గత సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రూ.30 కోట్ల నిధులు తెచ్చామని వివరించారు. తన 20 ఏండ్ల ప్రజా జీవితంలో పేదల గుడిసెలను ఎప్పుడూ కూల్చలేదని చెప్పారు. తనపై అసత్య ప్రచారాలు చేసినవారే ఎన్ఐటీ పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. వైఎస్సార్‌నగర్ గుడిసెవాసులకు, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.