హైదరాబాద్ జూన్ 6 (నమస్తేతెలంగాణ): ‘ప్రజా నాయకుడైన మాజీ మంత్రి హరీశ్‌రావును విమర్శించే స్థాయి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు లేదు.. సీఎం మెప్పుకోసమే హరీశ్‌రావుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో విమర్శించారు. సంపత్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ధన్వాడ ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా నిరసనలు తెలిపారని గుర్తుచేశారు. సమస్య పరిష్కరించకుండా హరీశ్‌రావుపై విమర్శలు చేయడం విడ్డూరమని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు కమీషన్ల కోసమే హరీశ్‌రావుపై బురద జల్లుతున్నదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పెద్ద ధన్వాడ రైతులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.