Forest | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని అడవులకు అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నది. మూడోవంతు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, అటవీ సమీప గ్రామాల్లోనే ఇవి చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,500కు పైగా అగ్ని ప్రమాదాలు జరిగినట్టు రికార్డుల్లో నమోదయ్యాయి. ఈ ప్రమాదాలతో నల్లమల, ములుగు తదితర ప్రాంతాల్లో 6 వేల హెక్టార్లలో అటవీ భూమికి నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు.
రాష్ట్రంలో 21,739 కిలోమీటర్ల పరిధిలో ఫైర్లైన్స్ వేయడంతో పాటు, అడవులకు ఆనుకొని ఉన్న 11 వేల కిలోమీటర్లలో ‘పెరిఫెరల్ ట్రెంచెస్’ తవ్వి మంటల అదుపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ ఫారెస్టు బీట్లో ఫైర్బ్లోయర్లు, ర్యాక్స్, పారలు, ఫైర్ బీటర్స్, సిబ్బందికి అగ్నినిరోధక దుస్తులు, బూట్లు, హెల్మెట్ల తదితర సామాగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.