కూసుమంచి/ ఖమ్మం రూరల్ /మహబూబాబాద్, సెప్టెంబర్ 11: ‘వందేండ్లలో ఎన్నడూ ఇలాంటి విపత్తు రాలేదు. రాత్రికి రాత్రే ఇళ్లు, పొలాలు మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కాలువలకు గండ్లు పడ్డాయి. పచ్చటి పంటలన్నీ మా కళ్లేదుటే ఎడారిలా మారాయి. అన్నింటా అపార నష్టం జరిగింది. ఆదుకోండి సారూ..’ అంటూ కేంద్ర బృందం ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాలకు చెందిన వరద బాధిత రైతులు. ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం అధికారులు బుధవారం పర్యటించారు. దీంతో వరద బాధితులు, రైతులు తమ ఆవేదనను కేంద్ర బృందానికి వినిపించారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ కూడా నష్ట తీవ్రత గురించి కేంద్ర అధికారులకు వివరించారు. తొలుత కూసుమంచి మండలంలో పర్యటించిన కేంద్ర అధికారులు.. పంటల నష్టానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండలం తనగంపాడులోనూ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి ఇసుక మేట వేసిన పొలాలను పరిశీలించారు. కేంద్ర బృందంలో సెంట్రల్ టీం అధికారులు కే.ప్రతాప్‌సింగ్, మహేశ్‌కుమార్, శాంతి స్వరూప్, కుషవహా, నియల్ఖాన్ సన్, శశివర్ధన్, విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. అదనపు కలెక్టర్ మధుసుదన్‌నాయక్, జిల్లా అధికారులు అభిమన్యుడు, విద్యాసాగర్, పుల్లయ్య, మంగలంపుడి వెంకటేశ్వర్లు, కోక్యానాయక్, వేణుగోపాల్‌రెడ్డి, సరిత, వాణి, రమేశ్‌రెడ్డి, మన్మథరావు, రత్నకుమారి, రామచందర్‌రావు, రత్నకుమారి,గణేశ్, పుల్లయ్య, మధుసూన్, సరిత, అపర్ణ, ఉమా నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని మహబూబాబాద్ జిల్లాలోకి కేంద్ర బృందం ప్రవేశించే సరికి రాత్రి 7 గంటలు అయ్యింది. రాత్రి వేళల్లో కేంద్ర బృందాల ఉరుకులు, పరుగులు అంతా ఇంతా కాదు. రాత్రి 7గంటలకు మరిపెడ అతిథి గృహానికి చేరుకున్నారు. ఇక్కడ వీరికి కలెక్టర్, అదనపు కలెక్టర్లు స్వాగతం పలికారు. అనంతరం సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి వరద నష్టంపై అంచనా వేశారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో ఎస్కే కుశ్వాహ, నియల కన్షన్, శశివర్దన్ బృందం అబ్బాయి పాలెంలో వరదలకు కొట్టుకుపోయిన పంచాయతీ రాజ్ రోడ్లను, గాలివారి గూడెం, పురుషోత్తమాయ గూడెం, ముల్కల పల్లి బ్రిడ్జిలను పరిశీలించారు. రాత్రి కావడంతో టార్చిలైట్ల, కారు వెలుతురులో నష్టాన్ని పరిశీలించారు. మరిపెడ మండలం అబ్బాయిపాలెం వద్ద ఇటీవల వరదలకు ధ్వంసమైన రోడ్లకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అధికారులు తిలకించారు. అదనపు కలెక్టర్ డేవిడ్‌తోపాటు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండో బృందం కల్నల్ కేపీ సింగ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యులు మరిపెడ మండలం ఉల్లేపల్లి గ్రామంలో పర్యటించింది. అక్కడ వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం మరిపెడ మండలం సీతారాం తండాలో బృందం పర్యటించింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి మాట్లాడిన కుటుంబసభ్యుల ఇస్లావత్ మంగీలాల్, కవితతో పాటు వారి ముగ్గురి పిల్లలు మాట్లాడారు. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. జిల్లాలో రాత్రి 7 నుంచి 10గంటల వరకు కేంద్ర బృందాల పర్యటన కొనసాగింది. అనంతరం రెండు బృందాలు ఖమ్మం జిల్లాకు వెళ్లాయి. కేంద్ర బృంద సభ్యులు మహేశ్‌కుమార్ శాంతినాథ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ తదితరులు ఉన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5,438 కోట్ల మేరకు నష్టం వాటిల్లందని, పూర్తిస్థాయి అంచనాల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా రాష్ర్టానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇటీవల వచ్చిన వరదలతో సంభవించిన అపారమైన నష్టాన్ని అంచనా వేసేందుకు కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర అధికారుల బృందం రాష్ర్టానికి బుధవారం విచ్చేసింది. సచివాలయంలో సీఎస్, సీనియర్ అధికారులతో భేటీ అయ్యింది. వరదలు, వాటిల్లిన నష్టాలను కేంద్ర బృందానికి సీఎస్ శాంతికుమారి వివరించారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో భారీ చెట్లు కూలిన సంఘటనలను, పర్యావరణ విపత్తు సమస్యను కూడా కేంద్ర బృందానికి సీఎస్ వివరించారు. విపత్తుకు మూలకారణాలను తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని కేంద్ర బృందం సీఎస్‌కు ఈ సందర్భంగా సూచించింది. వరదల కారణంగా ప్రాథమిక అంచనాల మేరకు రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లిందని, పూర్తిస్థాయి అంచనా ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని కేంద్ర బృందానికి విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ తెలియజేశారు. వరదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం తొలుత పరిశీలించింది.