- 3 జిల్లాల్లో తీవ్రంగా సమస్య
- ఐరన్ రిచ్ డైట్ తప్పనిసరి అంటున్న వైద్య నిపుణులు
- 58% మహిళల్లో రక్తహీనత
- నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడి
- వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు, రేవంత్రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రమాదంలో బాలికల భవిష్యత్తు
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకులాల్లో చదువుతున్న విద్యా కుసుమాలకు పౌష్టికాహాం అందడం దేవుడెరుగు, ఇస్తున్న ఆహారం సైతం కలుషితం అవుతూ విద్యార్థులు అస్వస్థత బారిన పడుతున్న సంఘటనలు దాదాపు ప్రతిరోజు వెలుగుచూస్తున్నాయి. విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యవేక్షిస్తుండగా… ఆహార కల్తీ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా గురుకులాలను స్థాపించడంతోపాటు పకడ్బందీ ప్రణాళికతో వాటిని సమర్థంగా నిర్వహించారు.
ఈ ఏడాది 38 గురుకులాల్లో ఫుడ్పాయిజన్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందగా, 886 మంది అస్వస్థతకు గురయ్యా రు. అన్ని వయసుల మహిళలు ఇప్పటికే 58 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 తాజాగా వెల్లడించింది. ఈ పరిణామం గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసించే బాలికలు, గిరిజనుల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు పేర్కొంది. వరుస ఫుడ్పాయిజన్ ఘటనలతో బాలికల్లో తీవ్ర ఐరన్ లోపం చోటు చేసుకున్నట్టు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఫుడ్పాయిజన్ ఘటనలతో బాలికలు ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిణామాలు విద్యార్థుల హాజరుపై ప్రభావం చూపుతున్నదని తెలిపారు. వాంతులు, విరేచనాలు శరీరంలో ఐరన్ నిల్వలను తగ్గించడంతోపాటు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుందని, ఫలితంగా రోగనిరోధకశక్తి పడిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 14-18 ఏండ్ల వయసున్న విద్యార్థినుల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
కాంగ్రెస్ పాలనలో 18 నెలలు గడిచినా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ శాఖను తన వద్ద పెట్టుకుని కూడా శ్రద్ధ వహించకపోవడంతో తరచుగా గురుకులాల్లో ఫుడ్పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నివారణ చర్యలు, పూర్తిస్థాయి పర్యవేక్షణ చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రక్తహీనతతో బాలికల ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధప్రతిపాదకన ఈ సమస్యను పరిష్కరించాలని నిపుణులు సూచిస్తున్నారు.