ఘట్కేసర్ రూరల్/మేడ్చల్, డిసెంబర్ 19: కలుషితాహారం కారణంగా 33 మంది మైనార్టీ గురుకుల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు కావడంతో వారిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగారంలోని తెలంగాణ సాంఘిక, సంక్షేమ మైనార్టీ గురుకుల పాఠశాల (మల్కాజిగిరి)కు చెందిన విద్యార్థినులు గురువారం మధ్యాహ్నం భోజనం చేశారు.
సాయంత్రం అల్పాహారం సమయంలో కొందరు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అవుతున్నట్టు ప్రిన్సిపాల్ స్వప్నకు తెలిపారు. సదరు విద్యార్థినులను ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించేందుకు యత్నిస్తుండగా, మరికొం దరు కడుపునొప్పితో ఇబ్బందులు పడ్డారు. దీంతో 33 మందిని ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విద్యార్థినులకు అక్కడి వైద్యులు వెంటనే చికిత్స అందించారు. వారిలో 9 మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో దవాఖానలో చేర్చుకొని ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థినులకు చికిత్స అందించి తీసుకువెళ్లవచ్చని వైద్యులు సూచించారు.
ఇదిలావుండగా, విషయం తెలిసిన జిల్లా వైద్యాధికారి రఘునాథ్ స్వామి దవాఖానకు చెరుకుని విద్యార్థినుల పరిస్థితిపై అరా తీశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల వసతి గృహంలో ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచి గాయపరిచిన ఘటనను మరవక ముందే నాగారంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. కీసర ఘటనతో అధికారులు అప్రమత్తం కాకపోవడంతో మరో ఘటన పునరావృతం అయింది. నాగారంలో ఫుడ్ పాయిజన్ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తుతున్నారు.