దేవరకొండ రూరల్, జూలై 14: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు.. పాఠశాలలో సుమారు 310 మంది విద్యార్థినులు ఉండగా ఆదివారం సాయంత్రం విద్యార్థినులకు స్నాక్స్, పెసర గుగ్గిళ్లు అందించారు. రాత్రి భోజనం బగారాతో చికెన్ వడ్డించారు. రాత్రి భోజనం తర్వాత కొందరు విద్యార్థినులు
కడుపునొప్పితో బాధపడటంతోపాటు విరేచనాలు చేసుకున్నారు. సోమవారం ఉదయం అల్పాహారంగా పులిహోర తిన్న తర్వాత 35మంది తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతుండగా, పాఠశాల ఏఎన్ఎం, టీచర్లు 13మంది విద్యార్థినులను దేవరకొండ దవాఖానలో, తూర్పుపల్లి పీహెచ్సీలో 22మందిని చేర్పించారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలుపడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఆర్డీవో రమణారెడ్డి, పలు విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు. అనంతరం ఆర్డీవో పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఫుడ్ పాయిజన్పై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
విద్యార్థినులు అస్వస్థత బారినపడిన ఘటనపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆరా తీశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా రేవంత్ సర్కార్ మొద్దునిద్ర వీడటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఆశ్రమ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 1,100 మంది విద్యార్థులు ఫుడ్పాయిజన్ బారినపడ్డారని, దాదాపు 60మంది చనిపోయారని తెలిపారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు మాట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ డీటీడబ్ల్యూవోను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.