జగిత్యాల (నమస్తే తెలంగాణ)/ జగిత్యాల రూరల్, జూలై 17: తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు ఫుడ్‌పాయిజన్‌కు నిలయాలుగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఒక సంఘటన మరువకముందే మరో ఘటన జరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను గురుకులాల్లో చదివించేందుకు జంకుతున్నారు. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండ లం లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్‌కు గురై 30మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికాగా దవాఖానకు తరలించారు. ఈ గురుకులంలో 570 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. బుధవారం భోజనం విషతుల్యం కావడంతో 30 మంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు.
ఆరో తరగతి విద్యార్థినులు సాత్విక, శ్రీనిక, తొమ్మిదో తరగతి విద్యార్థిని పరిచయ, పదో తరగతి విద్యారిన్థులు లక్ష్మీప్రసన్న, శ్రీజ, ఎనిమిదో తరగతి విద్యార్థిని పూలే శ్రీజ తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యారు. గురుకుల సిబ్బంది తల్లిదండ్రులకు ఫోన్ చేయగా శ్రీజ తండ్రి వచ్చి ఆమెను ప్రైవేట్ దవాఖానలో చేర్చించారు. మిగిలిన ఐదుగురు విద్యార్థినులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, ఉప వైద్యాధికారి శ్రీనివాస్ గురుకులం విద్యార్థినులకు వైద్యపరీక్షలు చేశారు. జగిత్యాల ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించారు. జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత, కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థినులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
జహీరాబాద్, జూలై 17: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ కస్తూర్బాగాంధీ విద్యాలయంలో బుధవారం రాత్రి పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 8వ తరగతి విద్యార్థినులు స్వప్నబాయి, పూజ, మీనాక్షి, సాక్షి, సోనాబాయి దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే వారిని ఉపాధ్యాయలు, సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
వైద్యాధికారులు పరీక్షలు చేసి, 108 వాహనంలో జహీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. అనంతరం సంగారెడ్డి జిల్లాకేంద్ర దవాఖానకు తరలించారు. ప్రస్తుతం విద్యార్థినులు కోలుకుంటున్నారని కస్తూర్బా విద్యాలయం ఇన్చార్జి ప్రత్యేకాధికారి సంగీత తెలిపారు.