రామాయంపేట, ఫిబ్రవరి 21: మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రోజు మాదిరిగా శనివారం ఉదయం విద్యార్థులకు రాగి జావ అందించారు. జావలో తెల్లపురుగులు వచ్చాయి. జావ తాగిన విద్యార్థులకు వాంతులు అయ్యాయి. విషయం తెలుసుకున్న హెచ్ఎం నాగమణి విద్యార్థులను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నది.
జిల్లా విద్యాశాఖ అధికారి విజయ పాఠశాలకు చేరుకొని హెచ్ఎం నాగమణి, విద్యార్థులతో వేర్వేరుగా మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. కాగా పాఠశాలలో కొన్ని రోజులుగా టీచర్లు, హెచ్ఎంకు మధ్య గొడవలు జరుగుతున్నాయని, గతంలో కూడా ఇరువురికి నచ్చజెప్పడం జరిగిందని డీఈవో మీడియాకు తెలిపారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. డీఈవో వెంట తహసీల్దార్ రజినీకుమారి, ఎంఈవో అయిత శ్రీనివాస్ ఉన్నారు.