IPS Trainee | హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల కేసు సంచలనంగా మారగా.. సదరు ట్రైనీ ఐపీఎస్ అధికారిణి నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించగా.. అతడు ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చాయని తెలిసిందే. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఉదయ్ కృష్ణారెడ్డి అసలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, అధికంగా మద్యం సేవించడంతో స్పృహ కోల్పోయాడని తాజాగా వైద్యులు ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మేమిద్దరం ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేయగా.. పిటిషన్లో కీలక విషయాలను వెల్లడించారు. తనపై ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్ అధికారితో ముస్సోరిలో శిక్షణ పొందుతున్న సమయంలో ప్రేమలో ఉన్నానని, ఇద్దరం మానసికంగా, శారీరకంగా సన్నిహితంగా ఉన్నామని, సర్వీస్‌లో చేరిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టుకు తెలిపాడు. అయితే తనకు మరో యువతితో సంబంధం ఉందనే అనుమానంతో ఆమె మే నెలలో ఓ ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకుందని ఉదయ్ కృష్ణారెడ్డి వెల్లడించాడు.
తిరిగి సంబంధాన్ని కొనసాగించాలని..
అనంతరం హైదరాబాద్ అకాడమీకి వచ్చాక తనకు మరో మహిళతో సంబంధం లేదని తెలుసుకుని, ఆమె తన గదికి వచ్చిందని.. తిరిగి సంబంధాన్ని కొనసాగించాలని కోరగా, అప్పటికే ఆమెకు వివాహం కావడంతో తాను తిరస్కరించానని పిటిషన్లో వెల్లడించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. సదరు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అయినా వినకుండా తనకు ఫోన్లు చేయడం, తరచూ తన గదికి రావడం చేసేదని.. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త నిలదీయడంతో, తానే ఆమెను వేధిస్తున్నానని భర్తకు చెప్పినట్లు పిటిషన్లో వివరించాడు.
ఆమె భర్త తనకు ఫోన్ చేసి ప్రశ్నించగా..గతంలో తమ మధ్య ఉన్న సంబంధం గురించి వివరించినా నమ్మకలేదని పేర్కొన్న ఉదయ్ కృష్ణారెడ్డి.. ముస్సోరిలో తాము సన్నిహితంగా ఉన్న వీడియోను ఆమె భర్తకు పంపానని, దీంతో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని తెలిపాడు. ఈ విషయంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిణితన పై పగ పెంచుకుని కావాలనే పోలీసులకు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసిందని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును కోరాడు. ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ కూడా మద్యం మత్తులో రాశాడని, అసలు ఆ నోట్ రాసిన విషయం కూడా తనకు గుర్తులేదని వైద్యులు తెలపడం గమనార్హం.