బడంగ్‌పేట, జనవరి 28 : రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని కందుకూరు గురులంలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 84 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, క డుపు నొప్పితో మంచం పట్టారు. అయితే, ఈ విషయాన్ని ప్రిన్సిపల్ తొక్కిపెట్టారు. బయటకు పొక్కకుండా విద్యార్థులను బెదిరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 26న గణతంత్రం దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు వడ్డించారు. వాటిని తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లోనే నర్సు సాయంతో వైద్యం చేయించేందుకు ప్రిన్సిపల్ ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతమంది పరిస్థితి సీరియస్ కావడంతో వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించగా విషయం బయటపడింది.
విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు వెంటనే గురుకులానికి వెళ్లగా వారిని ప్రిన్సిపల్ అడ్డుకున్నారు. గేటుకు తాళం వేశారు. పోలీసులను పిలిపించారు. ఆఖరికి తల్లిదండ్రులను లోపలికి అనుమతించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైనా కనీస సమాచారం ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది తమ పిల్లలను ఇండ్లకు తీసుకెళ్లారు. నర్సుతో వైద్యం చేయించామని ప్రిన్సిపల్ చెప్తున్నా.. విద్యార్థులు మాత్రం డాక్టర్లు వచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నట్టు ప్రిన్సిపల్ తెలపగా.. ప్రిన్సిపల్ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది పూర్తిగా కోలుకోలేదని, నిరుడు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని వారు మండిపడుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు అనేకసార్లు జరిగాయని, బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. హాస్టల్లో వసతులు సరిగా లేవని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు.