Food Poison | హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఊట్కూర్, నవంబర్ 21 (నమసే ్తతెలంగాణ): నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆహారం కలుషితమై 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై 24 గంటలు గడవకముందే అదే స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్లేట్లలో పురుగులు తీసి చూపిస్తూ తమ ప్రాణాలంటే లెక్కలేదా అంటూ నిలదీశారు. స్కూల్‌కు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, అధికారులపై మండిపడ్డారు. పిల్లల ప్రాణాలతో సర్కారు చెలగాటమాడుతున్నదని నిప్పులుచెరిగారు.
మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. పురుగులతో కూడిన భోజనం తిన్న 100 మంది విద్యార్థులు వాంతులు చేసుకుంటూ తరగతి గదుల్లోనే పడిపోయారు. వారిని మక్తల్ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. ఇందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాఠశాలకు చేరుకున్నారు. హెడ్మాస్టర్ మురళీధర్‌రెడ్డి, ఇంచార్జి హెడ్మాస్టర్ బాబురెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇదంతా జరిగి 24 గంటలు గడవకముందే అదే స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగింది.
శుక్రవారం మాగనూరు స్కూల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో అసిస్టెంట్ కలెక్టర్ బెన్ షాలోమ్ పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. జిల్లా విద్యాధికారి అబ్దుల్ గనీపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్డీవో రాంచందర్, ఎంపీడీవో రహీమతుద్దీన్, పౌరసరఫరాల అధికారి దేవదాసు, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం భోజనం పెడుతున్న ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. గురుకులాలు, పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సర్కారుకు పేద పిల్లల పట్ల చిన్నచూపు అని పడ్డారు. పాఠశాలకు చేరుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థులకు సొంతఖర్చుతో మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేశారు.
గురువారం ఉదయం విద్యార్థులకు దవాఖాన సిబ్బంది పెట్టిన ఉప్మాలోనూ పురుగులు కనిపించాయి. ఉప్మాను తినకుండా విద్యార్థులు పడేశారు. దవాఖాన అధికారుల తీరును నిరసించారు. ఆ తర్వాత దవాఖాన సిబ్బంది కిచిడీ పెట్టగా అందులోనూ తెల్ల పురుగులు వచ్చాయి. దవాఖాన ఎదుట ధర్నాకు దిగారు. దవాఖానలో విద్యార్థులను మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. రోగులకు నిర్లక్ష్యంగా పురుగుల అన్నం ఎలా పెడుతారని సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ సింగ్‌ను నిలదీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.