తాండూర్ : మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని సింగరేణి సేవాసమితి( Singreni Seva Samiti ) అధ్యక్షురాలు పద్మ విజయభాస్కర్ రెడ్డి, బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతులు, మహిళలకు సామాజిక భాధ్యత, స్వయం ఉపాధి కల్పనలో భాగంగా మాదారంలో శనివారం ఏర్పాటు చేసిన మగ్గం, స్పోకెన్ ఇంగ్లీష్ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే సాధించలేనిది ఏది ఉండదన్నారు. ప్రస్తుత సమాజానికి అను గుణంగా ప్రతి ఒక్కరు తమ కాళ్ల మీదా తాము నిలబడానికి వివిధ వొకేషనల్ ట్రైనింగ్ పొందుతున్నారని, సమాజంలో వివిధ ఫ్యాషన్‌తో కూడిన డిజైన్లు కొనుగో లు చేయడానికి ఖర్చుకు వెనుకాడటం లేదన్నారు.
ప్యాషన్‌తో కూడిన కుట్లు అల్లికలు, మగ్గంవర్క్స్, అందంగా అలంకరించడానికి బ్యూటీషియన్ లాంటి వాటికి ఎక్కువ ప్రా ధాన్యం ఇస్తున్నారన్నారు. ఇటువంటి వాటి లో శిక్షణ ఇచ్చేందుకు సింగరేణి సంస్థ ఖర్చుకు వెనుకాడడం లేదన్నారు. ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బయ్య మోగిలి మాట్లాడుతూ మాదారంలో యోగా శిక్షణ తరగతులను కొనసాగించాలని కోరారు.
అనంతరం మగ్గం, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులను సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు పద్మ ప్రారంభించారు. కార్యక్రమంలో డీజీఎం ఉజ్వల్ కుమార్ బెహరా, పర్సనల్ హెచ్ వో డి శ్రీనివాస్, సింగరేణి సేవా సమితి సభ్యురాలు నళిని, మగ్గం, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు శైలజ, చంద్రకళ, మహిళలు పాల్గొన్నారు.