Food Poison | నాగర్ కర్నూల్ : రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది.
పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు బుధవారం సాయంత్రం భోజనం చేసిన అనంతరం తీవ్ర కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిలో చందన అనే అమ్మాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. మరో బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
ఇదిలా ఉండగా హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతుండడంతో సౌకర్యాలు లేకుండా పోయాయని విద్యార్థినుల తల్లిదండ్రులు
ఆరోపిస్తున్నారు. తాడూరు మండల కేంద్రంలో కొనసాగాల్సిన ఈ బాలికల గురుకుల పాఠశాల తెలకపల్లి మండల కేంద్రంలోని సీఎల్ఆర్ విద్యాసంస్థల ఆవరణలో గల అద్దె భవనంలో గత మూడేళ్లుగా కొనసాగుతుండడం విశేషం. అరకొర వసతులతో అద్దె భవనంలో కొనసాగుతుండడం విద్యార్థుల అస్వస్థతకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ రష్మీ స్పందిస్తూ.. హాస్టల్లో ఎలాంటి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకోలేదని పేర్కొన్నారు.