హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ‘ఫుడ్ కాంక్లేవ్-2023’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 100 ఆహార పరిశ్రమల దిగ్గజాలు హాజరు కానున్నారు. ఈ దశాబ్దంలో భారత వ్యవసాయ-ఆహార రంగం వృద్ధికి ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐటీ, సేవలు, లైఫ్‌సైన్సెస్ రంగాలతోపాటు వ్యవసాయ రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉన్నదన్నారు. ‘ఫుడ్ కాంక్లేవ్-2023’ ఈవెంట్ ప్రధానంగా వ్యవసాయం (ఆకుపచ్చ), వంట నూనెలు (పసుపు), పాడి (తెలుపు), మాంసం (పింక్), మత్స్యసాగు (నీలం) చుట్టూ తిరిగే 5 నేపథ్య ట్రాక్‌లను హోస్ట్ చేస్తుందని చెప్పారు.