Congress Govt | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం జనవరిలో ఎన్నికలు నిర్వహిస్తుందని ప్రచారం జోరందుకున్నది. జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామం టూ గతంలో ప్రభుత్వం హడావుడి చేసింది. కానీ అదంతా ఉత్త ప్రచారమే అని తేలింది. జనవరిలో కూడా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ పని పూర్తికాకుండా, నివేదిక రాకుండా ఎన్నికల నిర్వహణ అసాధ్యమని కొందరు అంటున్నారు. కమిషన్ నివేదికతో సంబంధం లేకుండా ఎన్నికలకు వెళ్లడమంటే బీసీ రిజర్వేషన్లకు సర్కారు తిలోదకాలు ఇచ్చినట్టేనని చెప్తున్నా రు. స్థానిక ఎన్నికల పేరుతో ఆశ చూపించి, క్యాడర్ను విజయోత్సవాల్లో భాగస్వాములు చేయడానికి ప్రభుత్వం వేస్తున్న ఎన్నికల ఎత్తుగడ అని మరికొందరు భావిస్తున్నారు.
జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు కొనసాగుతున్నదని పలు మీడియా సంస్థల్లో గురువారం వార్తలు వెలువెడ్డాయి. ఫిబ్రవరి నుంచి 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు కథనాల్లో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనను కూడా ఎత్తివేయనున్నారని, రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని వార్తల్లో చెప్పారు. అయితే ఈ వివరాలన్నీ కూడా ప్రభుత్వ లీకులే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటనలు చేశారు. కసరత్తు మొదలైందని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తెలిపింది. కానీ ప్రక్రియ ప్రకటనలకే పరిమితమైందని గుర్తుచేస్తున్నారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందుకు ఇంటింటి సర్వే పేరుతో రంగంలోకి దిగింది. కానీ డెడికేటెడ్ కమిషన్ ద్వారానే సర్వే చేపట్టాలని హైకోర్టు తేల్చిచెప్పడంతో ఈనెల 4న మిషన్ను నియమించింది. కమిషన్ గడువు డిసెంబర్ 4తో ముగియనుంది. డిసెంబర్ 10 వరకు నివేదిక అందించాల్సి ఉంది. కానీ రిజర్వేషన్లపై అధ్యయనం, నివేదిక సమర్పణకు మరింత సమయం అవసరమని కమిషన్వర్గాలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికీ ఇంటింటి సర్వే పూర్తి కాలేదు. డెడికేటెడ్ సర్వే నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చట్టం చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశంలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి జనవరిలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అంటే బీసీ రిజర్వేషన్లు లేకుండా నిర్వహిస్తారేమో అని కూడా ప్రచారం జరుగుతున్నది.