CM KCR | పేదలు, రైతుల సంక్షేమంపై బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ముఖ్యంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగిన ప్రజా ఆశ్వీరాద సభలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాదరి కిశోర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాక ముందు పరిస్థితులు నా కన్నా మీకు ఎక్కువ తెలుసు. ఊళ్లలో అలజడులు.. అరాచకాలు.. ఆత్మహత్యలు.. ఆకలి చావులు.. వలసలు.. కరెంటు లేదు.. మంచినీళ్లు లేవు.. సాగునీళ్ల జాడలేదు.. చాలా భయంకరమైన పరిస్థితి తెలంగాణది.
ఆ రోజు వలసలు పోయి చెట్టుకొకరు గుట్టకొకరం అయిపోయాం. దీన్నింతటిని కూర్చి ప్రజలు వాపస్ వచ్చేట్టట్టు.. యువకులు తమ గ్రామానికే వచ్చేటట్టు.. తమ పొలాల్లో శాంతియుతంగా పని చేసుకొని ఉండేటట్టు ఎజెండాకు రూపకల్పన చేశాం. దేవుడి దయతో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. నేను గర్వంగా చెబుతున్నా భారతదేశంలో 70 ఏళ్ల నుంచి స్థిరపడిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయంలో నెంబర్ వన్‌గా ఉన్నది. ఒకనాడు 1100 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగం ఉన్న రాష్ట్రం.. ఇవాళ 2200పైచీలుకు దాటిపోతున్నది. ఇది కూడా తెలంగాణ కీర్తి’ అన్నారు.
‘ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం యొక్క ప్రగతిని కొలవాలంటే గీటురాయిగా చూసేది అన్నింటిని మించి తలసరి ఆదాయాన్ని చూస్తరు. తొమ్మిది పదేళ్లలో తెలంగాణ దేశానికే తలమానికం కావడం.. పెద్ద పెద్ద రాష్ట్రాలను మించి ఉండడం అనేది మనందరికీ గర్వకారణం. పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం.. అటు వ్యవసాయ విప్లవం.. అటు పారిశ్రామిక పెట్టుబడులు.. ఐటీ రంగంలో పెట్టుబడులు అన్నింటిపై స్ట్రాటజీ పెట్టుకున్నాం. వృత్తి పనులవారు ఎవరైతో ఉన్నారో వారిని విస్మరించలేదు.
గొర్రెల పెంపకందారులకు గొర్రెలను పంచుకుంటున్నాం.. చేపల పెంపకందారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. రూ.33వేలకోట్ల చేపల ఉత్పత్తులను తెలంగాణ అమ్మింది. చెరువులు, ప్రాజెక్టులు నిండి ఉంటే.. చుక్కనీరు లేని తిరుమలగిరి, తుంగతుర్తి నియోజకవర్గంలో ఎండాకాలంలో చెరువు మత్తడి దుంకే పరిస్థితి ఉన్నది. బ్రహ్మాండంగా మత్స్య సంపద పెరుగుతున్నది. భూగర్భ జలాలు పెరుగుతున్నాయ్’ అన్నారు.
కర్నాటక రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి వచ్చాడు. ఈ మధ్య మన రాష్ట్రానికి మహామహులు వస్తున్నరు. ఒకాయన లుంగీ కొట్టుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తడు. ఆయన రాష్ట్రంలో అన్నానికి గతిలేదు. తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తున్నడో లేదో తెల్వది. తెలంగాణ మొత్తానికి ఉత్తరప్రదేశ్, బిహార్, బెంగాల్ నుంచి నాట్లు వేయడానికి కూలీలు వస్తున్నరు. బతుకడానికి వస్తున్నరు. ఆ ముఖ్యమంత్రులు వచ్చి మనకు పాఠం చెబుతున్నరు ఈడ. నవ్వాల్నో ఏమో అర్థం కాదు. నిన్న కర్నాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణకు సుద్దులు చెబుతున్నడు.
మా కర్నాటకలో మీకు తెలుసా కేటీఆర్.. రోజుకు 5గంటల కరెంటు ఇస్తున్నం అంటున్నడు. సన్నాసి మాకు 24గంటల కరెంటు ఉన్నది అంటున్న. ఐదుగంటలోడు వచ్చి 24 గంటలోనికి చెబుతున్నడు. కర్నాటకు వచ్చి సూద్దువుదా మా అందం అంటున్నడు. నేను ఒక్కటే మాట చెబుతున్నా. తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరిన నాడు పడికెడు మందితో బయలుదేరాం. ఏం జరుగుతుందో తెలియదు. మొండి ధైర్యంతో.. ఎక్కడ రాజీపడకుండా.. వెనక్కి తిరిగి చూడకుండా ప్రజలకు ఒకటే మాట చెప్పాను. ఉద్యమానికి ద్రోహం చేస్తే.. ఉద్యమాన్ని వదిలేస్తే మమ్మల్ని రాళ్లతో కొట్టిచంపండి అని చెప్పాను. అంత సీరియస్‌గా తీసుకొని ఉద్యమం చేసిన నాడు ఎవరూ లేరు.
ఒక్క కాంగ్రెస్, బీజేపీ నాయకుడు వచ్చిండా? జేఏసీ రాజీనామా చేయాలంటే ఒకడు అమెరికా పారిపోయిండు.. మంత్రి పదవులు విడిచిపెట్టలే. ఎన్నడూ రాలే. పదవులే ప్రామాణీకం.. పైసలే మాకు ప్రమాణం అనుకొనిపోయారు తప్పా.. ఉద్యమంలో కలిసిరాలే. ఇవాళ అడ్డం పొడువు మాట్లాడతరు. ఇవాళ నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ.30వేలకోట్లతో భారతదేశంలోనే తొలి అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్ వస్తున్నది. రాబోయే నాలుగైదు నెలల్లో 4వేల మెగావాట్ల విద్యుత్ అదనంగా ఉత్పత్తి కాబోతున్నది. పేదల సంక్షేమం, అన్నిరంగాల్లో ముందుండాలని చేసుకుంటూ వెళ్తున్నాం’ అన్నారు.