హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : గోదావరి, కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ప్రతి ఏటా తొలుత గోదావరిలో వరద ప్రవాహాలు మొదలైతే, జూలై చివరి వారం, లేదంటే ఆగస్టు మొదటి వారంలో కృష్ణమ్మ ఉరకలెత్తేది. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా జూలై ఆరంభంలోనే కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. మరోవైపు ప్రాణహితలో తప్ప ప్రధాన గోదావరిలో వరద జాడన్నదే లేకుండా పోయింది. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోనూ విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు అప్పుడే వరద ప్రవాహం మొదలైంది. ఎగువ నుంచి వరద వచ్చి చేరుతున్నది. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్నీ అప్పుడే జలకళను సంతరించుకుంటున్నాయి.
కర్ణాటకలోని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరువయ్యాయి. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి దిగువకు జలాలను విడుదల చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సైతం క్రమంగా వరద పెరుగుతున్నది. మే చివరి నాటికి శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గానూ 34 టీఎంసీలకు పడిపోగా, ప్రస్తుతం అది 165 టీఎంసీలకు చేరుకున్నది. నెలరోజుల వ్యవధిలోనే 130 టీఎంసీలకుపైగా వరద జలాలు వచ్చి ప్రాజెక్టులోకి చేరాయి. ఇప్పటికీ ఎగువ నుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో జలవిద్యుదుత్పత్తిని చేపట్టి దిగువన నాగార్జున సాగర్‌కు జలాలు విడుదల చేస్తున్నారు. సాగర్‌లో సైతం నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో పదిరోజుల్లో రెండు ప్రాజెక్టులు ఎఫ్ఆర్ఎల్కు చేరుకుంటాయి.
సాధారణంగా జూన్ మొదటి వారంలోనే గోదావరి బేసిన్లో వరద సీజన్ ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది జూలై మొదటి వారం వచ్చినా వరద జాడలేకుండా పోయింది. మహారాష్ట్ర అప్పర్ గోదావరిలో సైతం వరద ప్రవాహాలు లేకుండా పోయాయి. ప్రాణహితలో వరద ప్రవాహం కొనసాగుతున్నా అది అంతంత మాత్రమే. దీంతో గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి.