నయీంనగర్, నవంబర్ 8 : భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, తమను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హనుమకొండ జిల్లాలోని వరద బాధితులు ఆందోళన చేపట్టారు. హనుమకొండ 56, 57వ డివిజన్లోని వివేక్‌నగర్, ప్రగతి కాలనీ, అమరావతికాలనీ, ఎన్జీవోస్ కాలనీ, సమ్మయ్యనగర్, కుడా కాలనీల వరద బాధితులు స్థానిక తులసీ బార్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ.. డక్ట్ ఓపెన్ చేస్తే ఇంత నష్టం జరిగేది కాదని, ఎందుకు ఓపెన్ చేయలేదో అధికారులే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వడ్డేపల్లి చెరువు వద్ద గేట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చే కాలువకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
హనుమకొండ జిల్లా అధికారుల నిర్లక్ష్యంతోనే 56, 57వ డివిజన్లలో గోపాలపురం ఊర చెరువు కట్ట తెగి పరిసర కాలనీలు వివేక్‌నగర్ కాలనీ, ప్రగతినగర్ కాలనీ, టీవీ టవర్ కాలనీ, సమ్మయ్య నగర్ కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, శ్యామలదుర్గాదాస్ కాలనీ, అమరావతినగర్ కాలనీలు నీటి మునిగినట్టు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వివేక్‌నగర్ కాలనీ తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆరోపించారు. 72 మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని ఒకే ప్రాంతం మీద వరద వదలకుండా సైంటిఫిక్‌గా సర్వే చేసి అన్ని ప్రాంతాల నుంచి వరద వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంతకంటే భారీ వర్షాలు కురిసిన సమయంలోనూ ఇంత పెద్ద డ్యామేజ్ జరగలేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంచేశారు.
ఇందుకు ప్రజాప్రతినిధులు బాధ్యత వహించి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టకపోతే అన్ని కాలనీల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని హెచ్చరించారు. వరదలతో ప్రతి ఇంట్లో సుమారు రూ.20 లక్షల మేర నష్టం జరిగిందని, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. అనంతరం వారిని పోలీసులు శాంతింపజేసి ధర్నా విరమింపజేశారు. ఈ ఆందోళనలో కార్పొరేటర్ సునీల్‌కుమార్‌తోపాటు డివిజన్లోని కాలనీ వాసులు పాల్గొన్నారు.